- 14 కాలేజీల నుంచి రీడిప్లాయ్‌మెంట్ ద్వారా మళ్లింపు
- నిరుపయోగంగా ఉన్న రెగ్యులర్ పోస్టులతో సర్దుబాటు
- వివిధ మెడికల్ డిపార్ట్‌మెంట్లకు ప్రాధాన్యం
హైదరాబాద్, వెలుగు: సనత్ నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న 1,142 రెగ్యులర్ పోస్టులను తాత్కాలికంగా టిమ్స్‌కు బదిలీ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఈ సంస్థను అటానమస్ ఇన్‌స్టిట్యూట్‌గా ప్రారంభించాలనే లక్ష్యంతో వైద్యారోగ్య శాఖ చేసిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ సర్దుబాటు చేపట్టింది. కొత్తగా రెగ్యులర్ నియామకాలు జరిగే వరకు టిమ్స్‌లో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ఈ అదనపు సిబ్బందిని వినియోగించుకోనున్నారు.
అత్యధికంగా నర్సింగ్ ఆఫీసర్లు..
రీడిప్లాయ్‌మెంట్ చేసిన పోస్టుల్లో అత్యధికంగా నర్సింగ్, వివిధ మెడికల్ డిపార్ట్‌మెంట్లకు ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 1,142 పోస్టుల్లో 850 స్టాఫ్ నర్స్ (నర్సింగ్ ఆఫీసర్) పోస్టులు, 20 హెడ్ నర్సులు, వివిధ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లకు చెందిన ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉన్నారు. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, వనపర్తి వంటి 14 మెడికల్ కాలేజీల నుంచి ఈ పోస్టులను సేకరించారు. కార్డియాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ వంటి కీలక డిపార్ట్‌మెంట్లలో నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
నిబంధనలు వర్తిస్తాయి..
ఈ పోస్టుల బదిలీలు కేవలం తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే జరగనున్నాయి. కొత్త పోస్టుల సృష్టి లేకుండా టిమ్స్‌లో వైద్య సేవలు ప్రారంభించేందుకు అవసరమైన కనీస సిబ్బందిని సమకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టిమ్స్ కోసం రెగ్యులర్ నియామకాలు పూర్తయిన వెంటనే, లేదా అవసరం లేదనుకున్నప్పుడు ఈ పోస్టులను తిరిగి వాటి మాతృ సంస్థలకు పంపించనున్నారు. ప్రస్తుతం రిక్రూట్‌మెంట్, ప్రమోషన్ ప్రక్రియలో ఉన్న పోస్టులకు ఈ ఉత్తర్వులు వర్తించవని, కేవలం ఖాళీగా ఉన్న పోస్టులను మాత్రమే మళ్లించామని స్పష్టం చేశారు.
