భారతీయ ఇతిహాసాల్లో అత్యంత పవిత్రమైన , గౌరవనీయమైన పాత్రల్లో సీతాదేవి ఒకటి. అందం, ఓర్పు, త్యాగం, ధైర్యం, ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలిచిన ఈ పాత్రను వెండితెరపై పోషించడం ప్రతి నటికి ఒక గొప్ప అదృష్టంగా భావిస్తారు. దశాబ్దాలుగా దక్షిణ భారత సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటీమణులు సీత పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇప్పుడు అదే జాబితాలో నేచురల్ స్టార్ సాయి పల్లవి కూడా చేరబోతోంది.
సీతగా సాయిపల్లవి..
దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పాన్-వరల్డ్ చిత్రం 'రామాయణ'లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తుండగా, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. 'సీతమ్మా.. నా ద్వారా నువ్వే నటించాలి అని ప్రతిరోజూ ధ్యానం చేసేదాన్ని. నా ఆలోచనలు, నా నటన పూర్తిగా పవిత్రంగా ఉండాలని ప్రయత్నించాను'అని చెప్పింది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 'రామాయణ' ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. దర్శకుడు నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్న ఈ మైథలాజికల్ ఎపిక్ పై అంచనాలను మరింత ఆకాశానికెత్తేసింది.
సీత పాత్రకు జీవం పోసిన నటీమణులు..
అయితే సాయి పల్లవికి ముందు కూడా ఎంతోమంది దిగ్గజ నటీమణులు సీత పాత్రకు జీవం పోశారు. తెలుగు సినీ చరిత్రలో ‘లవకుశ’ చిత్రంలో అంజలి దేవి చేసిన సీత పాత్ర నేటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. ఆమె హావభావాలు, భావోద్వేగ నటనను ఇప్పటికీ ఉత్తమ సీతగా సినీ అభిమానులు గుర్తు చేసుకుంటారు.
అలాగే 1976లో వచ్చిన తమిళ చిత్రం 'దశావతారం' లో లెజెండరీ నటి శ్రీదేవి తన అందం, అమాయకత్వంతో సీతగా మెప్పించారు. అదే ఏడాది విడుదలైన 'సీతా కల్యాణం'లో జయప్రద తన హుందాతనం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు 'భూకైలాస్'లో ప్రముఖ నటి విజయ నిర్మల బాల సీత పాత్రలో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
ఇక దర్శకుడు బాపు తెరకెక్కించిన 'శ్రీ రామ రాజ్యం'లో నయనతార సీతగా నటించి విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆమె నటనలో సీతాదేవి గంభీరత, కరుణ, ఆత్మగౌరవం అద్భుతంగా ప్రతిబింబించాయి. ప్రభాస్ 'ఆది పురుష్' లో సీతగా కృతి సనన్ మెప్పించింది. నాగార్జున మూవీ శ్రీరామదాసు లో సీతగా అర్చన నటించారు.
ఇప్పుడు ఈ గొప్ప వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతుండటంతో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆమె సహజ నటన, భావోద్వేగాలను పలికించే అభినయం, పాత్రల పట్ల చూపే అంకితభావం వెండితెరపై మరో చిరస్మరణీయ సీతను చూడబోతున్నామనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
►ALSO READ | Mahesh Babu : రిలాక్స్ మోడ్‌లో 'వారణాసి' టీమ్.. ఏఎంబీ సినిమాస్‌లో మహేష్, ప్రియాంక, నిక్ సందడి!
నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘రామాయణ’ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. 2026 దీపావళికి ‘రామాయణ’ మొదటి భాగం విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. రెండో భాగం 2027 దీపావళికి విడుదలవుతుందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో యష్ రావణుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. విడుదలైన తొలి ట్రైలర్‌ను చూసిన అభిమానులు ఇప్పటికే దీనిని 'భారతీయ సినిమా గర్వించదగ్గ విజువల్ మాస్టర్‌పీస్'గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
