నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద ప్రవాహం విపరీతంగా పెరిగింది. జులై 30న మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాజెక్టులోకి 1,21,704 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.
భారీగా వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు పూర్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని మొత్తం 18 గేట్లలో 16 గేట్లను ఎత్తివేశారు. దీని ద్వారా 1,69,340 క్యూసెక్కుల సర్‌ప్లస్ వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 693.250 అడుగుల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
►ALSO READ | ఎడతెరిపిలేని వర్షాలు: నిండుకుండలా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్
వరద ఉధృతి అధికంగా ఉండటంతో కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎవరూ కూడా నదిలోకి వెళ్లవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు వద్ద అధికారుల బృందం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
