హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు జిల్లా ప్రజాపరిషత్ (జడ్పీ) యూనిట్‌లో సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ చర్యలు చేపట్టింది. అర్హులైన గ్రేడ్-1 కార్యదర్శుల నుంచి సమ్మతి పత్రాలు సేకరించాలంటూ పీఆర్, ఆర్డీ డిప్యూటీ కమిషనర్ కె. సుధాకర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
జడ్పీ యూనిట్‌లో సూపరింటెండెంట్లుగా పదోన్నతి పొందేందుకు సిద్ధంగా ఉన్న గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శుల వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో సేకరించాలని డీపీఓలను ఆదేశించారు. ఈ నెల 31లోగా వివరాలన్నీ కమిషనర్ కార్యాలయానికి అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
