ఊళ్లల్ల మందు బంద్!..మద్యం నిషేధానికి కదులుతున్న గ్రామాలు

ఊళ్లల్ల మందు బంద్!..మద్యం నిషేధానికి కదులుతున్న గ్రామాలు
  • బెల్ట్  షాపులను బ్యాన్  చేస్తూ ఏకగ్రీవ తీర్మానాలు
  • కొత్త సర్పంచుల చొరవతో ఏకతాటిపైకి వస్తున్న జనాలు
  • కమలాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో తీర్మానాల జోరు
  • ఉమ్మడి వరంగల్  జిల్లాలో మరికొన్ని చోట్ల ఇదే తీరు
  • ధిక్కరిస్తే జరిమానాలు విధించేలా పాలకవర్గాల చర్యలు

హనుమకొండ, వెలుగు: మద్యం మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఊళ్లు ఏకమవుతున్నాయి. మైనర్ల నుంచి వృద్ధుల వరకు లిక్కర్ కు బానిసలుగా మారుస్తున్న బెల్ట్ షాపుల దందాకు చెక్ పెడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొందరు.. తాగుడుతో ఆగమైన కుటుంబాల పరిస్థితి చూసి ఇంకొందరు సర్పంచులు మద్య నిషేధానికి చొరవ చూపుతున్నారు. 

ఊళ్లల్లో బెల్ట్  షాపులను బ్యాన్  చేస్తూ పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. ఒక గ్రామాన్ని చూసి మరో గ్రామం.. ఇలా హనుమకొండ జిల్లావ్యాప్తంగా ఇప్పుడు తీర్మానాల జోరు నడుస్తోంది. ఉమ్మడి వరంగల్ లోనూ చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 

పంచాయతీ తీర్మానాన్ని ఉల్లంఘించి ఎవరైనా మద్యం అమ్మితే పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తామని చెబుతుండడంతో కొన్ని చోట్ల బెల్ట్ షాపుల నిర్వాహకులే స్వచ్ఛందంగా మద్యం అమ్మకాలు బంద్  చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.

ఎనీ టైం లిక్కర్ తో అనర్థాలు

ఉమ్మడి వరంగల్  జిల్లాలో 1,683 గ్రామాలుండగా.. ప్రతి ఊరిలో ఐదారు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. వైన్స్ లు ఉన్నప్పటికీ, కొన్ని ఊళ్లలో 20కిపైగా బెల్ట్ షాపులు నడుస్తుండగా, రాత్రీపగలు తేడా లేకుండా మద్యం అమ్ముతున్నారు. 

రిపబ్లిక్  డే, ఇండిపెండెన్స్  డే, గాంధీ జయంతి వంటి డ్రై డేల్లో కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నాయి. పోలీస్, ఎక్సైజ్  ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో ఊళ్లలో బార్లను తలపించేలా దందా సాగుతోంది. ఇలా ఏ టైమ్​లోనైనా లిక్కర్  దొరుకుతుండడంతో గ్రామాల్లో యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారు. 

అర్ధరాత్రి వరకు లిక్కర్​ అమ్మకాలతో అనర్థాలు, గొడవలు, ప్రమాదాలు జరుగుతుండగా, మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. మద్యానికి బానిసలైన వారి కుటుంబాలు ఆగం కాగా, ఇంటి పెద్దను కోల్పోయి అనేక ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయి. దీంతో బెల్ట్ షాప్ లను తీసేయాలని మహిళా సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. ఈక్రమంలో పంచాయతీ ఎన్నికల సమయంలో సర్పంచ్  అభ్యర్థులు బెల్ట్ షాపులు మూసేస్తామని హామీ ఇచ్చి పోటీకి దిగారు. ఇలా హామీ ఇచ్చిన వారితో పాటు లిక్కర్  బాధిత కుటుంబాల పరిస్థితిని గమనించిన సర్పంచులు గ్రామాల్లో బెల్ట్ షాపులను మూసివేయాలని నిర్ణయించారు. 

బెల్ట్ షాపులు బ్యాన్  చేస్తూ తీర్మానాలు

వరంగల్  జిల్లాలోని గంగదేవిపల్లి, మరియాపురం గ్రామాలు ఇప్పటికే సంపూర్ణ మద్యం నిషేధం పాటిస్తుండగా, ఇటీవల కొందరు సర్పంచులు గ్రామసభలు నిర్వహించి బెల్ట్​షాపుల మూసివేత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. హనుమకొండ జిల్లా కమలాపూర్  మేజర్  పంచాయతీలో సర్పంచ్ పాలకవర్గ సభ్యులతో కలిసి బెల్ట్​షాప్​ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. 

గత నెల 15 నుంచి బెల్ట్​షాపులపై నిషేధం విధించి అమలు చేస్తున్నారు. దీనిపై సోషల్  మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడం, ఇతర గ్రామాల్లోనూ చర్చకు దారితీసింది. దీంతో ఒక్కో గ్రామం మద్యం నిషేధం వైపు అడుగులు వేస్తున్నాయి. ఇలా కమలాపూర్  మండలం ఉప్పల్, ఉప్పల్ పల్లి, కమలాపూర్, భీంపల్లి, కానిపర్తి, శంభునిపల్లి, నేరెళ్ల, శనిగరం, గూనిపర్తి, భీమదేవరపల్లి మండలం భీమదేవరపల్లి,  కొత్తపల్లి,  కొప్పూరు, ఎల్కతుర్తి మండలం ఆరెపల్లి  గ్రామాల్లో మద్య నిషేధంపై తీర్మానం చేశారు.

భారీగా జరిమానాలు..

హనుమకొండ జిల్లాలోని 13 గ్రామాల్లో బెల్ట్​షాపుల మూసివేతకు తీర్మానాలు చేశారు. అయితే జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్  గ్రామం మద్యం నిషేధం పాటిస్తున్నప్పటికీ, పోలీస్  ఆఫీసర్లు, ఎక్సైజ్  ఆఫీసర్లు సహకరించడం లేదనే విమర్శలున్నాయి. 

దీంతో పంచాయతీ తీర్మానాన్ని ఉల్లంఘిస్తే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఫైన్  విధిస్తామని ప్రకటించారు. మద్యం అమ్మితే ప్రభుత్వ పథకాలు కట్  చేస్తామని, మద్యం నిషేధానికి సహకరిస్తే వివిధ పథకాల్లో ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నారు. దీంతో బెల్ట్​ షాపుల నిర్వాహకులు మద్యం అమ్మేందుకు వెనుకాడుతున్నారు.