మాజీ మంత్రి షబ్బీర్ అలీకి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు

మాజీ మంత్రి షబ్బీర్ అలీకి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ  షాక్ ఇచ్చింది.  ఇటీవల సంచలనంగా మారిన వివాదాస్పద ఆడియో లీక్ వ్యవహారంలో ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తక్షణమే పూర్తి వివరణ ఇవ్వాలని లేఖలో ఆదేశించింది.

పలు న్యూస్ ఛానెళ్లలో ప్రసారమైన కథనాల ఆధారంగా క్రమశిక్షణా కమిటీ ఈ చర్యలు చేపట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, అలాగే మహిళా క్యాడర్‌పై షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. లీకైన ఆడియోలోని సంభాషణలు.. పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని క్రమశిక్షణా కమిటీ తీవ్రంగా పరిగణించింది.

ఇక, న్యూస్ ఛానెల్స్ ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగులను కూడా నోటీసుతో పాటు షబ్బీర్ అలీకి జత చేసింది కమిటీ. ఎలాంటి ఆలస్యం చేయకుండా, ఈ వ్యాఖ్యలపై పూర్తి వివరాలతో కూడిన వివరణను సమర్పించాలని స్పష్టం చేసింది. ఒకవేళ పార్టీ నిబంధనలు, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే.. తదుపరి కఠిన చర్యలు ఉంటాయని కమిటీ గట్టిగా హెచ్చరించింది. ఈ నోటీసుతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.