వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోడీ భేటీ కానున్నారు. 2026, జూన్ 17న ఫ్రాన్స్ వేదికగా ఈ కీలక భేటీ జరగనుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ శనివారం (జూన్ 13) అధికారికంగా ధృవీకరించింది. ఈ భేటీలో ప్రధాని మోడీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు తెలిపింది.
కాగా.. 2026, జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్ వేదికగా ప్రతిష్టాత్మక జీ7 కూటమి సదస్సు జరగనుంది. ఈ కూటమిలో ఇండియా భాగస్వామ్య దేశం కానప్పటికీ.. ఈ సదస్సుకు రావాలని భారత ప్రధాని మోడీని ఫ్రాన్స్ ఆహ్వానించింది. ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు మోడీ జీ7 సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగానే జూన్ 17న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు మోడీ.
►ALSO READ | ఎవరైనా సరే.. రూల్స్ బ్రేక్ చేస్తే సహించం: ఇండియాకు అమెరికా కౌంటర్..!
ఈ భేటీలో వాణిజ్యం, ఇంధన సహకారం, హెచ్-1బి వీసా విధానాలు, ప్రాంతీయ భద్రత, పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితులపై ఇరువురు దేశాధినేతలు చర్చించే అవకాశం ఉంది. 2025, ఫిబ్రవరిలో చివరిసారిగా ప్రధాని మోడీ, ట్రంప్ ముఖాముఖీ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇరువురు దేశాధినేతలు కలవనుండటం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ట్రంప్, మోడీ ద్వైపాక్షిక భేటీ గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
