జపాన్‌‌‌‌లో పెను భూకంపం.. దెబ్బతిన్న పలు భవనాలు.. రోడ్లు 

జపాన్‌‌‌‌లో పెను భూకంపం.. దెబ్బతిన్న పలు భవనాలు.. రోడ్లు 

టోక్యో: జపాన్‌‌‌‌‌‌‌‌ను పెను భూకంపం వణికించింది. మంగళవారం మధ్యాహ్నం ప్రధాన ద్వీపమైన క్యుషు పరిధిలోని కుమామోటో ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూమి కంపించింది. ప్రాథమికంగా యూఎస్ జియోలాజికల్ సర్వే దీని తీవ్రతను 7.1గా నమోదైనట్టు చెప్పినప్పటికీ, తర్వాత 6.8గా సవరించింది. సముద్రమట్టం నుంచి 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. కాగా, భూకంప ధాటికి పలు ప్రాంతాల్లో భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. 

ప్రకంపనలు వచ్చిన వెంటనే జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) పశ్చిమ తీరప్రాంతాలైన అరియాకే, యత్సుషిరో సముద్ర తీరాలకు సునామీ హెచ్చరిక జారీ చేసినప్పటికీ, రెండు గంటల్లోనే దాన్ని ఉపసంహరించుకున్నది. భూకంప తీవ్రతకు యత్సుషిరో స్టేషన్‌‌‌‌‌‌‌‌లో పట్టాలు తప్పడంతో ఓ రైలు పక్కకు ఒరిగింది. ప్రముఖ చారిత్రక కట్టడమైన కుమామోటో కోట రాతి గోడలు దెబ్బతిన్నాయి. 

ప్రాథమిక సమాచారం ప్రకారం యత్సుషిరో నగరంలోని ఒక ఆసుపత్రికి దాదాపు 40 మంది గాయపడిన బాధితులు వచ్చారని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. పలుచోట్ల మంటలు చెలరేగగా, విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. భద్రతా కారణాల రీత్యా ప్రాంతీయ రైళ్లతోపాటు  బుల్లెట్ రైళ్ల సేవలను నిలిపివేశారు. ఆసో కుమామోటో విమానాశ్రయం రన్‌‌‌‌‌‌‌‌వేను తాత్కాలికంగా మూసివేశారు.

ప్రభుత్వం అప్రమత్తం.. సహాయక చర్యలు వేగవంతం

ప్రజల ప్రాణాల పరిరక్షణే తమ మొదటి ప్రాధాన్యత అని జపాన్ ప్రధాని సనై తకాయిచి స్పష్టం చేశారు. సమాచారం సేకరించడం, నష్టాన్ని అంచనా వేయడం, సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసినట్టు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ప్రజలు గ్యాస్ స్టవ్‌‌‌‌‌‌‌‌లు, మంటలు, పగిలిన గాజు పెంకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

మరోవైపు, పరిసరాల్లోని 3 అణు విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని జపాన్ అణు నియంత్రణ సంస్థ అధికారులు ప్రకటించారు. రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు తదుపరి భూకంప ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక విమానాలను రంగంలోకి దించింది.