- ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారికి ఈ రెండు పార్టీల మద్దతు
- తుమ్మిడిహట్టిపై త్వరలో మహారాష్ట్ర సీఎంతో సమావేశం
- ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతాం
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దూసుకుపోతున్న తెలంగాణ
- మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్
హైదరాబాద్, వెలుగు: హైడ్రాకు వ్యతిరేకంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమించినవారికే ఈ రెండు పార్టీలు మద్దతు ఇస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ తన సొంత మీడియా ద్వారా హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
విలువైన ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను హైడ్రా కాపాడిందని, దీనికి మద్దతుగా పేదలు, మధ్యతరగతి ప్రజలు ర్యాలీలు కూడా నిర్వహించారని మంత్రి గుర్తుచేశారు. హైడ్రా కమిషనర్ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని పూర్తిగా పరిశీలించిన తర్వాత, ప్రభుత్వం తరఫున తగిన వాదనలను కోర్టుకు విన్నవిస్తామని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి జెన్-జీ యువతతో పోటీపడి పనిచేస్తున్నారని కొనియాడారు. ఢిల్లీలో మోదీ నివాసం ముందు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ధర్నా చేయడం వల్లే దేశవ్యాప్తంగా జెన్-జీ ఉద్యమానికి ఊపు వచ్చిందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా బీజేపీకి చెంపపెట్టు అని పేర్కొన్నారు. సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశం కావడంతోనే జెన్-జీ యువతకు కాంగ్రెస్ అండగా నిలిచిందని తెలిపారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై త్వరలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మన సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ ముందుందని, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో రాష్ట్రం దూసుకుపోతున్నట్లు నీతి ఆయోగ్ కూడా చెప్పిందని గుర్తుచేశారు. ఐటీతోపాటు పారిశ్రామిక రంగంలోనూ తెలంగాణ దూసుకుపోతోందన్నారు. బెంగళూరు కంటే ఎక్కువ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్‌కే వచ్చాయని వివరించారు.
ఒప్పందం చేసుకున్న కంపెనీలు సక్రమంగా గ్రౌండింగ్ అవుతున్నాయని తెలిపారు. మహారాష్ట్రలో కేవలం 45 శాతం మాత్రమే గ్రౌండింగ్ అయితే, తెలంగాణలో 52 శాతం పరిశ్రమలు గ్రౌండింగ్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కాంగ్రెస్ పార్టీదేనని, పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 70 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, రెండేండ్లలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మరెక్కడా లేదన్నారు. .
