- కేసు నమోదు చేసిన తూప్రాన్ పోలీసులు
తూప్రాన్, వెలుగు: యూట్యూబ్‌లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వచ్చిన యాడ్ ను నమ్మి ఓ వ్యక్తి 72,69,973 పోగొట్టుకున్నాడు. తూప్రాన్ ఎస్సై యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణానికి చెందిన ఓ నిరుద్యోగి గత నెలలో యూట్యూబ్‌లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన చూసి ‘ ఎన్114 ఎలైట్ చాట్ హబ్’ అనే వాట్సాప్ గ్రూప్లో చేరాడు. ఆ గ్రూపులో ఉన్న వ్యక్తులు తమను స్టాక్ మార్కెట్ నిపుణులుగా పరిచయం చేసుకొని, నకిలీ ట్రేడింగ్ యాప్‌ను అసలైన యాప్ గా నమ్మించి డౌన్‌లోడ్ చేయించారు.
అనంతరం యాప్ లో వచ్చిన నకిలీ లాభాలను నమ్మిన బాధితుడు పలు దఫాలుగా నకిలీ యాప్ నిందితులు సూచించిన వివిధ బ్యాంకు అకౌంట్లలో రూ.72,69,973 పెట్టుబడులు పెట్టాడు. అనంతరం నగదును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, ఇంకా నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాను మోసపోయినట్లు గుర్తించిన భాదితుడు ఈ నెల 25న ఎన్సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయగా, మంగళవారం తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
