సైబర్ మోసాలకు మరణ శిక్ష.. మోసం చేసినా, చేయించినా ఉరే

సైబర్ మోసాలకు మరణ శిక్ష.. మోసం చేసినా, చేయించినా ఉరే

నేపిడావ్: సైబర్ నేరాలు, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ మోసాలను అరికట్టేందుకు మయన్మార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలకు పాల్పడేవారికి ఇకపై మరణశిక్ష విధించేందుకు వీలుగా తెచ్చిన యాంటీ-ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ స్కామ్ బిల్లుకు ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో యాంటీ-ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ స్కామ్ బిల్లుకు మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపారు. ఇప్పటికే అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న మయన్మార్ దేశంలో కొద్దికాలంగా ఇంటర్నెట్ స్కామ్ కేంద్రాలు విపరీతంగా పెరిగిపోయాయి. 

రొమాన్స్ స్కామ్‌‌‌‌‌‌‌‌లు, నకిలీ క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల పేరిట సైబర్ ముఠాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమాయక నెటిజన్లను లక్ష్యంగా చేసుకుని భారీగా మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో విదేశీయులను సైతం అక్రమంగా రప్పించి, వారిని నిర్బంధించి, తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసి మరీ సైబర్ నేరాలు చేయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అమెరికా, చైనా వంటి దేశాల నుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిడి నేపథ్యంలో మయన్మార్ ప్రభుత్వం యాంటీ-ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ స్కామ్ అనే నూతన చట్టాన్ని రూపొందించింది. 

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ మోసాలకు పాల్పడేలా ఇతరులను బలవంతపెట్టినా, సైబర్ నేరాల కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా బాధ్యులకు  కచ్చితంగా మరణశిక్ష విధించేలా చట్టంలో స్పష్టమైన నిబంధనలు పొందుపరిచారు. అలాగే, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ స్కామ్ కేంద్రాలను నేరుగా నడిపేవారికి, క్రిప్టోకరెన్సీ మోసాలకు పాల్పడేవారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా కఠిన శిక్షలను ఖరారు చేశారు.

అయితే, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా మారడం లేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో దాడులు జరగడం వల్ల నేరగాళ్లు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయకుండా ప్రాంతాలు మారుస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక పలు సాయుధ గ్రూపులు, సిండికేట్‌‌‌‌‌‌‌‌లు భాగస్వామ్యమై ఉండటంతో.. సైబర్ నేరాల నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా అణచివేయడం సవాళ్లతో కూడుకున్న పనిగా మారిందని పేర్కొన్నారు.