UPI ట్రాన్సాక్షన్స్ డేటాతో SBI సరికొత్త ప్రయోగం.. చిన్న వ్యాపారులకు ఈజీ లోన్స్

UPI ట్రాన్సాక్షన్స్ డేటాతో SBI సరికొత్త ప్రయోగం.. చిన్న వ్యాపారులకు ఈజీ లోన్స్

వ్యాపారం చిన్నది.. జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేదని ఇకపై చింతించాల్సిన పనిలేదు. ఇకపై మీ షాపులో వచ్చే డిజిటల్ యూపీఐ చెల్లింపులే మీకు పెద్ద బ్యాంక్ లోన్ ఇప్పించబోతున్నాయి. చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారాల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. ఎలాంటి జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని చిన్న వ్యాపారులకు సైతం కేవలం ఒక్క రోజులోనే లోన్స్ అందించేందుకు అదిరిపోయే టెక్నాలజీ సొల్యూషన్‌ను సిద్ధం చేస్తోంది.

ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో SBI మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని కుమార్ తివారీ ఈ కీలక విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు జీఎస్టీ, పాన్ డేటా ఆధారంగా కేవలం 10 నిమిషాల్లోనే లోన్లు ఇస్తున్న ఎస్బీఐ.. గత 18 నెలల్లో రూ.లక్ష కోట్ల లోన్స్ మంజూరు చేసింది. అయితే జీఎస్టీ లేని చిన్న వ్యాపారులు మాత్రం ఫార్మల్ ఫైనాన్స్ వ్యవస్థకు దూరంగా ఉంటున్నారని, వారి సమస్యను తీర్చడమే ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

జీఎస్టీ లేని వ్యాపారుల లావాదేవీలను అంచనా వేయడానికి UPI డేటాను ప్రత్యామ్నాయంగా వాడుకోనున్నట్లు అశ్విని తివారీ తెలిపారు. వ్యాపారంలో రెగ్యులర్ సేల్స్ జరుగుతున్నప్పుడు.. ఆ యూపీఐ లావాదేవీల రికార్డులనే అమ్మకాలకు ఒక ప్రాక్సీగా పరిగణించనున్నారట. తద్వారా చిన్న వ్యాపారుల క్యాష్ ఫ్లో ఎలా ఉందనే దానిపై బ్యాంకుకు స్పష్టమైన అంచనా వస్తుందని వెల్లడించారు.

యూపీఐ లావాదేవీల పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. కస్టమర్ల అధికారిక అనుమతితో ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. రిసీవర్ బ్యాంక్, థర్డ్-పార్టీ యాప్‌ల వద్ద ఉన్న లావాదేవీల డేటాతో పాటు టెలికాం కంపెనీల సమాచారాన్ని సేకరించి అధునాతన మోడల్స్ ద్వారా క్రెడిట్‌వర్తీనెస్‌ను అంచనా వేస్తారు.

ఈ ప్రత్యామ్నాయ డేటా ఇన్‌పుట్స్ సహాయంతో 'భారత్' లోని మారుమూల చిన్న వ్యాపారుల రుణ సమస్యలను పూర్తిగా పరిష్కరించవచ్చని స్టేట్ బ్యాంక్ బలంగా నమ్ముతోంది. ఫార్మల్ ఫైనాన్స్ అందక అల్లాడుతున్న వ్యాపారులకు ఈ డిజిటల్ లోన్ విధానం ఒక గొప్ప వరంలా మారనుందని టెక్ నిపుణులు అంటున్నారు.