బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభమైన ఐదు రోజుల్లోనే ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకు మైండ్‌బ్లాక్ ఇస్తోంది. సాధారణంగా బిగ్‌బాస్‌లో మొదటి వారం కాస్త నెమ్మదిగా సాగుతుందని అనుకుంటారు. కానీ ఈసారి మాత్రం సీన్ పూర్తిగా రివర్స్. ఆరంభం నుంచే బిగ్‌బాస్ ఇచ్చిన అనూహ్య ట్విస్టులతో సంచలనం సృష్టిస్తోంది. వారం కూడా పూర్తికాకముందే ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లోనే కాదు.. బయట కూడా ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
మొదట హౌస్‌మేట్స్ ఓటింగ్ ఆధారంగా RJ చరణ్ మిడ్‌వీక్ ఎలిమినేట్ అయి వెళ్లిన విషయాన్ని జీర్ణించుకోకముందే..ఐదో రోజు శుక్రవారం మరో సంచలనం నమోదైంది. కంటెస్టెంట్స్ మధ్య వర్గాలు, అపార్థాలు పీక్స్‌కి చేరాయి. మరోవైపు అమన్, రోహిత్, సృష్టి, షాలిని కలిసి ఝాన్సీ గేమ్‌పై చర్చించడం ఆసక్తికరంగా మారింది. ఆమె పరిస్థితిని బట్టి గ్రూపులు మార్చుకుంటోందా? లేక ఇదే ఆమె స్ట్రాటజీనా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
ఇక బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌తో అసలు ఆట మొదలైంది. ఏడుగురు సులభమైన టాస్క్, ఇద్దరు కష్టమైన టాస్క్ ఆడాలని చెప్పడంతో సుధీర్, వర్షిణి హై రిస్క్ టాస్క్‌కు ఎంపికయ్యారు. ఇప్పటికే హై రిస్క్‌లో ఉన్న చైత్రను మాత్రం బిగ్‌బాస్ ఆ టాస్క్‌కు దూరంగా ఉంచాడు. 'రన్ రాజా రన్' టాస్క్‌లో రాంప్రసాద్ అదరగొట్టి విజేతగా నిలిచాడు. అయితే గెలిచిన వెంటనే ఒకరిని హై రిస్క్‌లోకి పంపే అవకాశం రావడంతో అమన్ పేరును ఎంచుకున్నాడు. దీంతో హౌస్‌లో కొత్త చర్చ మొదలైంది.
ఇంతలో సుధీర్, వర్షిణి ఆడిన కేక్ స్మాష్ టాస్క్‌లో జరిగిన విషయం బయటకు రావడంతో ఇద్దరూ హై రిస్క్ జోన్‌లోకి వెళ్లారు. చివరికి చైత్ర, వర్షిణి, అమన్, సుధీర్‌లలో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓటింగ్‌లో వర్షిణి, అమన్, సుధీర్ ముగ్గురూ చైత్ర పేరే చెప్పడంతో.. ఆమెకు షాక్ తగిలింది. మూడు ఓట్లతో చైత్ర ఎలిమినేట్ అయ్యింది. 'నాలుగు రోజుల్లో ఇద్దరినీ తీసుకెళ్లిపోతారా?' అంటూ రాంప్రసాద్ వేసిన కామెంట్ నవ్వులు పూయించినా..మిగతా హౌస్‌మేట్స్‌లో ఒణుకు మొదలైంది.
ప్రస్తుతం ఎలిమినేట్ అయిన చరణ్, చైత్రలను సీక్రెట్ రూమ్‌కి పంపారా లేక శాశ్వతంగా బయటకు పంపేశారా అనేది బిగ్‌బాస్ సస్పన్స్‌గా ఉంచారు. నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌కి రానుండటంతో హౌస్‌మేట్స్‌కి ఎలాంటి క్లాస్ పడుతుందోనని ఆసక్తి నెలకొంది. ఈ వారం హౌస్ అందరూ నామినేషన్లలో ఉండగా, కనీస ఓటింగ్ సాధించలేక నటుడు కృష్ణుడు బాటమ్ ప్లేస్‌లో ఉన్నారు. శని, ఆదివారాల్లో మూడో ఎలిమినేషన్ ఉంటుందా లేక బిగ్‌బాస్ బిగ్ ట్విస్ట్ ఇస్తారా అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.
