కేరళను కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ స్కాం నిందితురాలు స్వప్న సురేష్ పెళ్లి.. సహ నిందితుడే పెళ్లి కొడుకు !

కేరళను కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ స్కాం నిందితురాలు స్వప్న సురేష్ పెళ్లి.. సహ నిందితుడే పెళ్లి కొడుకు !

కేరళలో ఆసక్తికర పరిణామం జరిగింది. కేరళ పాలిటిక్స్ను కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న స్వప్న సురేష్ పెళ్లి చేసుకుంది. ఇదే కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పి.ఎస్.సరిత్ను ఆమె పెళ్లాడింది. కొచ్చిలోని నెట్టూర్లో ఉన్న వడక్కే పట్టుపురక్కల్ ఆలయంలో ఈ పెళ్లి జరిగింది.

నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాలకు సంబంధించిన బంధువులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. తిరువనంతపురంలోని తైకాడ్ స్వప్న స్వస్థలం కాగా, సరిత్ స్వస్థలం తిరువల్లం. ఈ ఇద్దరూ కలిసి కొన్నేళ్లుగా కొచ్చిలో కలిసి ఉంటున్నారు. సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫొటోలను పోస్ట్ చేశారు.

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ హయాంలో వెలుగుచూసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు, వడక్కంచేరి లైఫ్ మిషన్ స్కాం.. ఈ రెండు కేసుల్లో స్వప్న, సరిత్ పేర్లు ప్రధానంగా వినిపించాయి. 30 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులతో స్వప్నకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలడంతో ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసు అందరి దృష్టిని ఆకర్షించింది.

అప్పటి ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఈ కేసు చాలా తలనొప్పులనే తెచ్చిపెట్టింది. కేరళ ఎన్నికల్లో పినరయి విజయన్, ఆయన నేతృత్వం వహిస్తున్న పార్టీ ఓటమికి కూడా ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఒక కారణంగా చెప్పొచ్చు. ఈ కేసు ఈడీ పరిధిలో ఉంది.