కాలేజీకి అని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ 18 ఏళ్ల విద్యార్థిని ఏడు నెలలుగా కనిపించకుండా పోయింది. ఎంత గాలిస్తున్నా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో కేసు సీఐడీ వరకు వెళ్లింది. చివరికి అధికారులు ఆమెను కేవలం ఒక ఆధార్ ఓటీపీ (Aadhaar OTP) ద్వారా కనిపెట్టారు.
పోలీసుల సమాచారం ప్రకారం... బెంగళూరులోని విద్యారణ్యపురానికి చెందిన ఓ యువతి పీయూసీ (PUC) సెకండియర్ చదువుతోంది. ఈ ఏడాది జనవరి 31న కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరింది... కానీ తిరిగి ఇంటికి రాలేదు. ఆమె వెంట ఫోన్ గానీ, ఎలాంటి ఇతర వస్తువులుగానీ తీసుకెళ్లలేదు. కేవలం కాలేజీ బ్యాగ్, ఆధార్ కార్డు మాత్రమే తీసుకెళ్లింది. ఆమెతో పాటు మరో మైనర్ స్నేహితురాలు కూడా ఇలాగే ఇంటి నుండి పారిపోయింది.
ఇద్దరూ కలిసి 'మలై మహదేశ్వర కొండల' ప్రాంతానికి చేరుకుని, అక్కడి నుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఎంత వెతికినా ఎలాంటి క్లూ దొరకలేదు. దింతో బాధితులు కర్ణాటక హైకోర్టులో 'హెబియస్ కార్పస్' పిటిషన్ ఫైల్ చేయగా, విచారణ బాధ్యతలను కోర్టు సీఐడీ (CID) కి అప్పగించింది.
కేసును మలుపు తిప్పిన 'ఆధార్ ఓటీపీ'
ఆమెని ఎంత వెతికినా దొరకని ఈ కేసులో ఒకే ఒక్క ఆధార్ ఓటీపీ కీలక ఆధారంగా మారింది. ఆ యువతి ఒక ప్రభుత్వ సంక్షేమ పథకానికి అప్లై చేసుకోవడానికి తన ఆధార్ కార్డు వివరాలను వాడింది. ఆ సమయంలో ఓటీపీ ఇంకా ఆధార్ అప్‌డేట్ కోసం తన భర్త మొబైల్ నంబర్‌ను ఇచ్చింది.
ఆధార్ ప్రాసెసింగ్‌లో జనరేట్ అయిన ఓటీపీ నెట్‌వర్క్ లోకేషన్‌ను పోలీసులు సాంకేతికంగా ట్రాక్ చేయగా, ఆ సిగ్నల్స్ కనకపుర తాలూకాలోని ఒక గ్రామానికి చెందింది. వెంటనే అక్కడకు వెళ్లిన సీఐడీ బృందం ఆమెను సురక్షితంగా గుర్తించి పట్టుకుంది.
కేసు పరిశీలనలో ఆమె ఒక వ్యక్తిని వివాహం చేసుకుని, ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు తేలింది. అధికారులు ఆమెను హైకోర్టు ముందు హాజరుపరిచి, అనంతరం తల్లిదండ్రుల వద్దకు పంపించారు. అయితే, ఆమెతో పాటు పారిపోయిన మైనర్ స్నేహితురాలి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో పోలీసులు ఆమె కోసం గాలింపులు వేగవంతం చేశారు.
