Child Psychology: ఫ్రిజ్‌పై పిల్లల డ్రాయింగ్స్, మెడల్స్ పెడతారు..ఎందుకో తెలుసా? దీని వెనుక సైకాలజీ ఇదే!

Child Psychology: ఫ్రిజ్‌పై పిల్లల డ్రాయింగ్స్, మెడల్స్ పెడతారు..ఎందుకో తెలుసా? దీని వెనుక సైకాలజీ ఇదే!

ఈ మధ్య కాలంలో పిల్లల డ్రాయింగ్స్, వారు సాధించిన మెడల్స్, సర్టిఫికెట్లు నిత్యం ఉపయోగించే ఫ్రిడ్జ్ పై ఉంచడం చాలా ఇండ్లలో కనిపిస్తుంది. చాలా ఇళ్లలో ఫ్రిడ్జ్ కేవలం వస్తువులను దాచుకునే సాధనంగానే కాకుండా, పిల్లల ప్రతిభను ప్రదర్శించే ఓ మినీ ఆర్ట్ గ్యాలరీగా మారిపోయింది. అయితే ప్రదర్శించడం వెనుక సహజమైన సైకాలజీ దాగి ఉందంటున్నారు సైకాలజిస్టులు.  ఇది కేవలం ఇల్లు సర్దడం లేదా డెకరేషన్ లాగా కాకుండా, పిల్లల మానసిక ఎదుగుదలకు తోడ్పడే ఓ అద్భుతమైన సాధనంగా చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, మెమరబుల్ ఎక్స్ పీరియెన్స్, మాది అనే భావన, పిల్లలు, పేరెంట్స్ మధ్య బాండింగ్ బలపడుతుందంటున్నారు.  అది ఎలా సాధ్యమో చూద్దాం.. 

దీని వెనుక సైకాలజికల్ థియరీ ఇదే:

పిల్లల్లో ఆత్మవిశ్వాసం, గుర్తింపు..వవిలువైన అనుభూతి: ఇండ్లలో ఫ్రిడ్జ్ అనేది ప్రతి ఒక్కరూ రోజూ చూసే, ఎక్కువగా ఉపయోగించే ఓ ముఖ్యమైన ప్లేస్. అలాంటి చోట తమ బొమ్మలను పెట్టడం వల్ల,  నా పనికి ఇంట్లో చాలా విలువ ఉంది" అనే భావన పిల్లల్లో కలుగుతుంది.

ప్రోత్సాహం: తాము గీసిన బొమ్మను అందరూ చూసి మెచ్చుకుంటుంటే పిల్లల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

పిల్లల్లో మాది అనే భావన 

మేమూ ఓ భాగం: ఫ్రిడ్జ్ పై తమ వస్తువులు ఉండటం చూసి, పిల్లలు ఆ ఇల్లు కేవలం పెద్దలది మాత్రమే కాదు, అందులో తాము కూడా ఓ ముఖ్యమైన భాగమే అని మానసికంగా భావిస్తారు. ఇది వారికి కుటుంబం పట్ల ఒక రకమైన భద్రతను, అనుబంధాన్ని పెంపొందిస్తుంది. 

పేరెంట్స్ ప్రేమ,అప్యాయత 

ప్రేమను వ్యక్తపరచడం: మాటల్లో చెప్పడమే కాకుండా, పిల్లల ప్రతిభను ఫ్రిడ్జ్ పై పెట్టడం ద్వారా  ‘‘నీవంటే మాకు గర్వంగా ఉంది’’ అని తల్లిదండ్రులు చెప్పకనే చెబుతారు. ఇది పిల్లలు, తల్లిదండ్రుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

జ్ఞాపకాలు సురక్షితం

విజయాలకు గుర్తుగా: పిల్లలు సాధించిన మెడల్స్ నిరంతరం కళ్ల ముందు ఉండటం వల్ల, ఆ విజయం వెనుక వారు పడ్డ కష్టం ,దానికి వచ్చిన గుర్తింపు గుర్తొస్తూ ఉంటాయి. ఇది భవిష్యత్తులో మరిన్ని మంచి పనులు చేయడానికి వారికి పాజిటివ్ రీఇన్‌ఫోర్స్‌మెంట్ లాగా పనిచేస్తుంది.

ఫ్రిజ్‌పై పిల్లల డ్రాయింగ్స్, మెడల్స్, సర్టిఫికెట్లు పెట్టడం చిన్న విషయంలా కనిపించినా, వారి మనసుపై మాత్రం మంచి ప్రభావాన్ని చూపించే అలవాటుగా మారొచ్చు. తమ ప్రతిభకు కుటుంబంలో గుర్తింపు, తమపై తల్లిదండ్రుల ప్రేమ, తాము కుటుంబంలో ముఖ్యమైన భాగమనే భావన పిల్లల్లో పెరుగుతుంది. అంతేకాదు, గత విజయాలను కళ్లముందు ఉంచడం వారిలో మరింత సాధించాలనే స్ఫూర్తిని కలిగిస్తుంది. ప్రతి చిన్న విజయాన్ని ఇతర పిల్లలతో పోల్చకుండా, పిల్లల కృషిని గుర్తించి అభినందించడం చాలముఖ్యం.  ఫ్రిజ్‌పై కనిపించే ఆ చిన్న డ్రాయింగ్, మెడల్స్ పిల్లల దృష్టిలో మాత్రం వారి ప్రతిభకు ఇంట్లో విలువ ఉంది అనే పెద్ద భరోసా కాబట్టి.