హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్టీసీ బస్సులో నుంచి దూకేందుకు ప్రయత్నించిన ఓ బాలికను కండక్టర్, డ్రైవర్, తోటి ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించి కాపాడారు. పటాన్‌చెరులోని తెలంగాణ మైనారిటీ గురుకులానికి చెందిన ఓ విద్యార్థిని మంగళవారం పటాన్‌చెరులో ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఆమె వద్ద రూ.10 నోటు మాత్రమే ఉండగా, కాళ్లకు చెప్పులు కూడా లేకపోవడంతో కండక్టర్ శేఖర్‌కు అనుమానం వచ్చింది.
టికెట్ అడిగినా బాలిక సమాధానం చెప్పకపోవడంతో డ్రైవర్ కుమార్‌కు విషయం తెలియజేశారు. ఇద్దరూ బాలికపై నిఘా ఉంచగా, ఆమె ఓ ప్రయాణికుడి ఫోన్ తీసుకుని ఎవరితోనో మాట్లాడింది. అనంతరం కదులుతున్న బస్సులో నుంచి దూకేందుకు ప్రయత్నించింది.
అయితే కండక్టర్, ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై ఆమెను అడ్డుకుని కాపాడారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఆమె మైనారిటీ గురుకుల విద్యార్థినిగా గుర్తించారు. అనంతరం బాలికకు ధైర్యం చెప్పి సురక్షితంగా సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
