ఆగస్టు మొదటి వారంలో ఎథిక్స్ కమిటీ ముందుకు కౌశిక్ రెడ్డి కేసు

 ఆగస్టు మొదటి వారంలో ఎథిక్స్ కమిటీ ముందుకు కౌశిక్ రెడ్డి కేసు
  • మంగళవారం మొదటిసారి సమావేశమైన కమిటీ 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ మొదటి సమావేశం మంగళవారం శాసనసభలోని కమిటీ హాల్ లో జరిగింది. చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మొదటి సమావేశంలో ఎథిక్స్ కమిటీకి ఇప్పటి వరకు సిఫారసు చేసిన అంశాలు ఏమిటనే దానిపై చర్చించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. సీనియర్ సభ్యుడైన కడియం శ్రీహరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన అంశాన్ని స్పీకర్ ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసిన విషయంపై చర్చించారు.

అయితే, వచ్చేవారం ఈ కమిటీ మరోసారి సమావేశమై కౌశిక్ రెడ్డి అంశంపై పూర్తిస్థాయిలో చర్చించి, ఓ నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ చైర్మన్ హోదాలో ఆయన అధ్యక్షత రూల్స్ కమిటీ కూడా మొదటిసారి సమావేశమైంది. చైర్మన్ సంజీవ రెడ్డి అధ్యక్షతన హామీల కమిటీ కూడా మొదటిసారి సమావేశమైంది. గత ప్రభుత్వంలో 750 హామీలు పెండింగ్ లో ఉన్నాయని, ఇక నుంచి ప్రతి నెలా మీటింగ్ పెట్టి ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని నిర్ణయించినట్టు చైర్మన్ సంజీవ రెడ్డి మీడియాకు చెప్పారు.