తాడిచర్ల బ్లాక్-2కు త్వరగా అనుమతులివ్వండి: కేంద్ర మంత్రికి మంత్రి వివేక్, ఎంపీ వంశీ విజ్ఞప్తి

తాడిచర్ల బ్లాక్-2కు త్వరగా అనుమతులివ్వండి: కేంద్ర మంత్రికి మంత్రి వివేక్, ఎంపీ వంశీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణి సంస్థకు కేటాయించిన తాడిచర్ల బ్లాక్-2 గనికి అవసరమైన పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్‌‌లో కేంద్ర పర్యావరణ–అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌‌ను కలిసి కోరారు. వీరి వెంట ఎంపీ సురేశ్ షెట్కార్ ఉన్నారు. ఈ సందర్భంగా.. తాడిచర్ల బ్లాక్ –2, ఆర్ కేపీ మైన్స్‌‌కు త్వరితగతిన పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రికి వినతి పత్రం సమర్పించారు. 

ప్రధానంగా తాడిచర్ల బ్లాక్ ప్రాజెక్టు ప్రారంభమైతే స్థానికంగా 1,000 మందికి పైగా యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రికి వివరించారు. అలాగే ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని భూపేంద్ర యాదవ్ దృష్టికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీసుకెళ్లారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.. సంబంధిత అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

రెండేండ్ల పోరాటంతో తాడిచర్ల: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రెండేండ్లు తాము చేసిన పోరాటంతో తాడిచర్ల బ్లాక్ -2ను సింగరేణికి కేటాయిస్తూ కేంద్రం చర్యలు తీసుకుందని వంశీకృష్ణ అన్నారు. అయితే.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌‌ను వేగంగా ప్రారంభించాలన్నా.. స్థానిక యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌‌ను కలిసి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరినట్లు వివరించారు. అలాగే ఆర్ కేపీ మైన్స్‌‌కు వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఈ అనుమతులు వస్తే పెద్ద సంఖ్యలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.