మంజీరకు వరద.. నిండుకుండలా ‘ఘనపూర్’..ఆయకట్టు రైతుల్లో చిగురించిన ఆశలు

మంజీరకు వరద..  నిండుకుండలా ‘ఘనపూర్’..ఆయకట్టు రైతుల్లో చిగురించిన ఆశలు
  • ఊపందుకున్న వరినాట్లు

మెదక్/ కొల్చారం, వెలుగు: గత మూడు రోజులుగా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మంజీరా నదికి వరద వచ్చింది. దీంతో కొల్చారం మండల పరిధిలోని ఘనపూర్ ఆనకట్ట నిండుకుండలా మారింది. మంగళవారం ఉదయం నుంచి ఆనకట్ట పైనుంచి నీరు పొంగి పొర్లుతోంది.  వర్షాభావ పరిస్థితులతో ఆందోళనకు ఉన్న ఆయకట్టు రైతుల్లో పంటల సాగు పై ఆశలు చిగురించాయి. ఘనపూర్ ఆనకట్ట కింద  పాపన్నపేట, కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలో 21,625 ఎకరాల సెటిల్డ్ ఆయకట్టు ఉంది. 

చిలప్ చెడ్  , కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలో మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం లు, చెక్ డ్యామ్ లు, నదీ లో ఏర్పాటు చేసుకున్న రింగ్ బావుల ఆధారంగా మరో 10 వేల ఎకరాల వరకు  పంటలు సాగు చేస్తారు. అయితే ఈ వానాకాలం సీజన్ లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఈ సారి పంటలు సాగు చేయడం కష్టమే అనుకున్నారు. కాగా, గత నెలలలో స్థానికంగా కురిసిన వర్షాలకు ఘనపూర్ ఆనకట్ట నిండింది. దీంతో మహబూబ్ నహర్, ఫతేనహర్ కాల్వలకు నీరు విడుదల చేయడంతో ఆయకట్టు పరిధి నాలుగు మండలాల్లో  దుక్కులు దున్ని వరి నారుమళ్లు రెడీ చేసుకున్న రైతులు వరి నాట్లు మొదలు పెట్టారు. ఇప్పుడు ఆనకట్టలో ఉన్న నీరులో పది రోజుల వరకు పంటకు ఢోకా లేదు. ఇక ఆగస్టు నెలల్లో ఎలాగైనా వర్షాలు కురుస్తాయని పంటపై భరోసాతో రైతులు వరి నాట్లు వేయడంలో వేగం పెంచారు.