ప్రకృతి సేద్యంతోనే నేలకు రక్షణ : ఆదిలాబాద్ కలెక్టర్‌‌ రాజర్షిషా

ప్రకృతి సేద్యంతోనే నేలకు రక్షణ :  ఆదిలాబాద్ కలెక్టర్‌‌ రాజర్షిషా
  • త్వరలోనే జొన్న కొనుగోలు బకాయిలు రూ.130 కోట్లు విడుదల
  •     కలెక్టర్‌‌ రాజర్షి షా, ఎమ్మెల్యే బొజ్జు

గుడిహత్నూర్‌‌(ఉట్నూర్‌‌), వెలుగు: రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి సేద్యం వైపు మొగ్గుచూపాలని ఆదిలాబాద్ కలెక్టర్‌‌ రాజర్షిషా, ఖానాపూర్‌‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పిలుపునిచ్చారు. మంగళవారం ఉట్నూర్‌‌ రైతు వేదికలో నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్చువల్‌‌గా నిర్వహించిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్‌‌ వీడియో కాన్ఫరెన్స్​ను అధికారులు, రైతులతో కలిసి వారు వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూరియా, డీఏపీల మితిమీరిన వాడకంతో పంటల దిగుబడి తగ్గడమే కాకుండా వాతావరణం పాడైపోతుందన్నారు. 

ఆవు పేడ, సేంద్రియ ఎరువుల వాడకంతో నేల సారం పెరుగుతుందని, ప్రకృతి సేద్యం చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని వెల్లడించారు. డీ-పట్టా భూముల్లో కూడా ఆయిల్‌‌పామ్‌‌, మైక్రో ఇరిగేషన్​కు భారీ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. జొన్న కొనుగోలు బకాయిలు రూ.130 కోట్లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్‌‌ హామీ ఇచ్చారు. హైబ్రిడ్‌‌ విత్తనాలు, ఎరువులు కొని మోసపోవద్దని హెచ్చరించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యవసాయ అధికారులను, ఆదర్శ రైతులను సన్మానించారు. రైతులకు మొక్కలు పంపిణీ చేసి, స్టాల్స్‌‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో మోహన్‌‌ సింగ్, డీఏవో రవీందర్, తహసీల్దార్‌‌ రఘునాథ్, ప్యాక్స్‌‌ చైర్మన్‌‌ ప్రభాకర్‌‌ రెడ్డి, సర్పంచ్ అనిత, అధికారులు, రైతులు పాల్గొన్నారు.