రేప్ నిందితులను సమర్థించిన వ్యక్తికి విద్యాశాఖ బాధ్యతలా...?: రాహుల్ గాంధీ

రేప్ నిందితులను సమర్థించిన వ్యక్తికి విద్యాశాఖ బాధ్యతలా...?: రాహుల్ గాంధీ
  • బిల్కిస్ బానో కేసులో దోషులకు జోషి మద్దతుగా నిలిచారు

న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషిపై కాంగ్రెస్​ అగ్రనేత, లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అతడు అత్యాచార నిందితులను సమర్థించిన వ్యక్తి అని, బిల్కిస్ బానో కేసులో దోషులుగా తేలిన వారికి మద్దతుగా నిలిచారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా ఎలా ఎంపిక చేస్తారని ప్రధాని మోదీ నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు. ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రి పదవిలో ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు.

మంగళవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో రాహుల్​మాట్లాడారు. ‘అత్యాచార నిందితులకు రక్షణ కల్పించే వ్యక్తిని బీజేపీ విద్యా శాఖ మంత్రిగా నియమించింది. ఆయన అత్యంత నీచమైన వ్యక్తి. అత్యాచారానికి పాల్పడిన వారికి రక్షణ అవసరమని చెప్పే వ్యక్తి కంటే నీచమైన వారు మరొకరు ఉండరు. ఆయనే నేడు భారతదేశ విద్యాశాఖ మంత్రి’ అని రాహుల్ అన్నారు. 

ఈ బాధ్యతను అప్పగించడానికి ఎంతోమంది మంత్రులు ఉన్నప్పటికీ.. ప్రధాని ఆయన్నే ఎందుకు ఎంచుకున్నారని ఆయన ప్రశ్నించారు. ‘ప్రధాని నిర్ణయం చిత్రంగా ఉంది. ఆయన మంత్రివర్గంలో చాలామంది ఉన్నారు. కానీ, అత్యాచార నిందితులను రక్షించే వ్యక్తిని ఆయన ఎంచుకున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరం’ అని రాహుల్ పేర్కొన్నారు.