న్యూఢిల్లీ: శ్రీలంకతో జరగనున్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం 15 మందితో కూడిన ఇండియా టీమ్‌ను సెలెక్టర్లు మంగళవారం ప్రకటించారు. మధ్యప్రదేశ్ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ సారాన్ష్ జైన్‌కు తొలిసారి టెస్ట్‌ల్లో చోటు కల్పించారు. హ్యామ్ స్ట్రింగ్ గాయం వల్ల స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉండే చాన్స్ లేదు. ఈ నేపథ్యంలో డొమెస్టిక్ క్రికెట్‌లో పదేళ్లుగా నిలకడగా రాణిస్తున్న 33 ఏళ్ల సారాన్ష్‌కు అవకాశం ఇచ్చారు.
చంద్రకాంత్ పండిట్ ట్రెయినింగ్‌లో మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ గెలవడంలో సారాన్ష్ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల శ్రీలంకలో ఇండియా–ఎ టూర్‌లోనూ సారాన్ష్ 6 వికెట్లు తీశాడు. ఇక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ టీమ్‌లోకి వచ్చారు. పేసర్ గుర్నూర్ బ్రార్ ప్లేస్ నిలబెట్టుకున్నాడు.
అయితే గాయాలతో ఇబ్బందిపడుతున్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, బ్యాటర్ సాయి సుదర్శన్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. టూర్‌కు బయలుదేరే ముందు వీళ్లకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకవేళ బుమ్రా ఫిట్‌నెస్ పరీక్షలో ఫెయిలైతే.. యష్ ఠాకూర్, అకిబ్ నబీలో ఒకరికి చాన్స్ దక్కనుంది.
టెస్ట్ జట్టు వివరాలు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాన్ష్ జైన్.
