ఆదిలాబాద్లో చిన్నారి కిడ్నాప్.. బస్టాండ్లో ఇతరులకు అప్పగించిన మహిళ

ఆదిలాబాద్లో చిన్నారి కిడ్నాప్.. బస్టాండ్లో ఇతరులకు అప్పగించిన మహిళ
  • ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ పట్టణంలో చిన్నారి కిడ్నాప్​ కలకలం రేపింది. బస్టాండ్​లో ఓ మహిళ బాలికను ఇతరులకు అప్పగించిన ఘటన ఆందోళన రేకెత్తించింది. డీఎస్పీ ఎల్.జీవన్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన నైతం నాగుబాయి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అదే గ్రామానికి చెందిన ఆత్రం గంగామణి(4)ని కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆదిలాబాద్  పట్టణానికి తీసుకువచ్చింది. బస్టాండ్  వద్ద ఇతరులకు అప్పగించింది.

చిన్నారి కనిపించకపోవడంతో ఆమె కోసం తల్లిదండ్రులు వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం తలమడుగు పోలీస్​స్టేషన్​లో బాలిక తల్లి ఆత్రం కప్లిబాయి ఫిర్యాదు చేయగా, నిందితురాలిపై కిడ్నాప్​ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆదిలాబాద్​ రూరల్ సీఐ రహీం పాషా, తలమడుగు ఎస్సై డి.రాధిక, రూరల్​ ఎస్సై విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో 3 బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్, తాంసి బస్టాండ్  పరిసరాల్లోని సీసీ పుటేజీని పరిశీలించగా, చిన్నారి మహిళతో ఉన్నట్లు గుర్తించారు. చిన్నారికి కొలాం, తెలుగు భాషలు వస్తాయని, ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేస్తామని డీఎస్పీ తెలిపారు. డయల్​ 100, 8712659928,​ 8712659915,- 8712659914 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.