ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి..అవసరమైన విత్తనాలు అందిస్తాం : మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్

ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి..అవసరమైన విత్తనాలు అందిస్తాం : మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్(భీమారం)/బెల్లంపల్లి/నస్పూర్, వెలుగు: ఎల్​నినో ప్రభావాన్ని అధిగమించేందుకు రైతులు వరి మినహా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసి లబ్ధి పొందాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సోమవారం భీమారం, బెల్లంపల్లి మండలంలోని గురిజాల రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన విత్తన మేళాను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీటి ఇబ్బంది కారణంగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి లబ్ధి పొందాలన్నారు. పప్పుధాన్యాలు, పత్తి, కూరగాయలు,ఆయిల్ పామ్ వంటి తక్కువ నీరు అవసరమున్న పంటలు సాగు చేయాలని, అవసరమైన రాయితీ విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్థానిక పీహెచ్​సీని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, ల్యాబ్, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. 

పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

వర్షాకాలం దృష్ట్యా మున్సిపల్ పరిధిలోని డివిజన్లు, వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేవించారు. కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్యతో కలిసి అభివృద్ధి పనుల స్పీడప్, పారిశుద్ధ్య పనుల నిర్వహణ అంశాలపై మున్సిపల్ కమిషనర్లతో రివ్యూ నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పారిశుధ్య నిర్వహణలో అలసత్వం లేకుండా పకడ్బందీగా చేపట్టాలన్నారు. అంతర్గత రోడ్లు, మురుగు కాలువల పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.