- టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసినా గైర్హాజర్ అయినట్లు రిజల్ట్
- ఉన్నతాధికారులకు ఫిర్యాదు.. విచారణలో స్టూడెంట్ ఎగ్జామ్ రాసినట్లు గుర్తింపు
- అన్ని సబ్జెక్టుల్లో పాసైనట్లు మెమో జారీ
మంచిర్యాల, వెలుగు : టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహణలో మంచిర్యాల జిల్లా విద్యాశాఖ ఆఫీసర్ల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఓ స్టూడెంట్ అసలు ఎగ్జామే రాయలేదని మొన్నటి వరకు చెప్పిన ఆఫీసర్లు.. ఇప్పుడు అదే స్టూడెంట్ పాస్ అయినట్లు మెమో జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... మంచిర్యాల జిల్లా దండేపల్లి జడ్పీ హైస్కూల్ లో సిద్ధి అంజమ్మ అనే స్టూడెంట్ టెన్త్ క్లాస్ పూర్తి చేసింది. మార్చిలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయగా మాథ్స్, సైన్స్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయింది.
దీంతో సప్లిమెంటరీ ఫీజు చెల్లించి జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్ లో జూన్ 8న మాథ్స్, 9, 10న సైన్స్ ఎగ్జామ్ రాసింది. ఇందులో సైన్స్ పాస్ కాగా మాథ్స్ ఆబ్సెంట్ అయినట్లు రిజల్ట్ వచ్చింది. దీంతో అంజమ్మ తాను గర్ల్స్ హైస్కూల్ రూం నంబర్ 4లో మాథ్స్ ఎగ్జామ్ రాశానని, తనకు న్యాయం చేయాలని కలెక్టర్ ను వేడుకుంది.
ఈ విషయంపై కలెక్టర్ ఆరా తీయగా.. స్టూడెంట్ అంజమ్మ ఎగ్జామ్ రాయలేదంటూ తమ వద్ద ఉన్న ఆధారాలు సమర్పించారు. అనంతరం అంజమ్మ, ఆమె తల్లి విద్యాశాఖపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కలెక్టర్ సూచన మేరకు నస్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అనంతరం అంజమ్మ హైదరాబాద్ లోని విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు విచారణ జరుపగా... అంజమ్మ 4వ నంబర్ రూమ్ లో ఎగ్జామ్ రాసినట్లు నిర్ధారించారు. అలాగే 49 మార్కులతో పాస్ అయినట్లు మెమో సైతం జారీ చేశారు. బాధ్యులైన ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్, చీఫ్ సూపరింటెండెంట్, ఎగ్జామ్స్ కోఆర్డినేటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు డీఈవోను ఆదేశించారు. దీంతో చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు సంబంధిత ఆఫీసర్లు తర్జనభర్జన పడుతున్నారు. గండం నుంచి గట్టెక్కేందుకు పైరవీలు చేస్తున్నట్టు సమాచారం.
