- అమెరికన్లు టార్గెట్‌గా ‘కాల్ సెంటర్స్ ఇండియా.కామ్’ పేరిట మోసాలు
- మాదాపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్‌లో కాల్ సెంటర్లు
- మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు
- నిందితుడు వికాస్ కె నిమార్ అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: అమెరికన్లు సహా విదేశీయులను టార్గెట్ చేసి ఫేక్ కాల్ సెంటర్ల ద్వారా మోసాలకు పాల్పడిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేసింది. ‘కాల్ సెంటర్స్ ఇండియా.కమ్’ పేరుతో నడిచిన ఈ మోసాల కేసులో మనీలాండరింగ్, విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనల కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లోని ఏడు ప్రాంతాలు, బెంగళూరులోని రెండు ప్రాంతాల్లో మొత్తం 9 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వికాస్ కె. నిమార్‌ను బెంగళూరులో అరెస్ట్ చేశారు. అతడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం వెల్లడిస్తామని ఈడీ అధికారులు తెలిపారు.
హైదరాబాద్, బెంగళూర్‌లో సోదాలు
హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ కేంద్రాలుగా నకిలీ కాల్ సెంటర్లు నడిపిన గుజరాత్ గ్యాంగ్‌పై 2023లో సైబరాబాద్ పోలీసులు దాడులు చేశారు. మాదాపూర్‌లో ‘కాల్ సెంటర్స్ ఇండియా.కమ్’ పేరుతో నడిపిన కాల్ సెంటర్ ద్వారా అమెరికన్లను మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ సెల్, అమెజాన్ ఆర్డర్ల పేరుతో అమెరికా కస్టమర్లను నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో మెక్సికో, కెనడా, కొలంబియా దేశాలకు దాదాపు 2.5 మిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇదే వ్యవహారంలో ఢిల్లీ, అహ్మదాబాద్‌లో కూడా కేసులు నమోదయ్యాయి. కోట్ల రూపాయల మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ గతేడాది కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది.
బిట్‌కాయిన్లు, క్రిప్టో ద్వారా డబ్బుల తరలింపు..
ఈ కేసులో గత 4 నెలల క్రితం హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఈడీ సోదాలు చేసింది. బ్యాంక్ ఖాతాల వివరాల ఆధారంగా బిట్‌కాయిన్లు, క్రిప్టోకరెన్సీ, హవాలా మార్గాల్లో విదేశాలకు డబ్బులు తరలించినట్లు గుర్తించింది. అహ్మదాబాద్‌లో జరిగిన సోదాల్లో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఆకిబ్ గులామ్ రసూల్ ఘాంచి దగ్గర నుంచి సుమారు 12 వేల డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీ, రూ.13.5 లక్షల నగదు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మహమ్మద్ అన్సారి అలియాస్ మహమ్మద్ ఇర్ఫాన్ అన్సారి, ఆకిబ్ గులామ్ రసూల్ ఘాంచి, దివ్యాంగ్ రావల్, ప్రదీప్ వి. రాథోడ్‌లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా వికాస్ కె. నిమార్‌తో పాటు మరో నిందితుడిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది.
