- మూడు యూనిట్లుగా పనులు ప్రారంభం
- భారీ వర్షాలు కురిసి బండరాళ్లు జారినా ఇబ్బంది రాకుండా రోడ్డు నిర్మాణం
- ఫ్లై ఓవర్ ఏర్పాటుకు హెచ్‌టీ లైన్‌తో ఇబ్బందులు
- లైన్మార్పునకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు ప్రతిపాదనలు చేసిన ఆఫీసర్లు
- జాతర నాటికి ఘాట్‌రోడ్డును అందుబాటులోకి తెచ్చేలా పనులు
మహబూబ్‌నగర్, వెలుగు : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా ఘాట్ రోడ్డు నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించింది. ఇందు కోసం మొత్తం రూ.110 కోట్లను మంజూరు చేయగా, రానున్న నాలుగు నెలల్లో రోడ్డును భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చకచకా పనులు చేయిస్తోంది.
మూడు యూనిట్లుగా పనులు ..
రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు పనులను మూడు యూనిట్లుగా చేస్తున్నారు. మొదటి యూనిట్లో ఘాట్ రోడ్డు నిర్మాణం జరగనుండగా, అమ్మాపూర్ గ్రామం నుంచి కురుమూర్తి క్షేత్రం వెనుక ఉన్న గుట్టల మీదుగా నాలుగు వరుసల రోడ్డు (ఔట్ వే)ను వేస్తున్నారు. ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో యూనిట్లో ఆలయ ఆర్చీ నుంచి కురుమూర్తి క్షేత్రం ప్రారంభంలోని స్వాగత ఆర్చీ వరకు ఉన్న డబుల్ రోడ్డును నాలుగు వరుసల రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. ఇదే యూనిట్లో కురుమూర్తి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న హనుమాన్ విగ్రహం వద్ద కుడి, ఎడమ వైపు 300 మీటర్ల చొప్పున రోడ్డు వేసి జంక్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు. మూడో యూనిట్లో సబ్ స్టేషన్ నుంచి కురుమూర్తి గుట్ట మీది వరకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి (ఇన్ వే)ను నిర్మించే పనులు ప్రారంభించారు.
బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి ఘాట్‌రోడ్డు..
అమ్మాపూర్మీదుగా కురుమూర్తి క్షేత్రం వెనుక భాగం నుంచి ఘాట్‌రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈసారి అక్టోబరులో జరిగే కురుమూర్తి బ్రహ్మోత్సవాల ప్రారంభం నాటికి ఈ రోడ్డును అందుబాటులోకి తీసుకురానున్నారు. వర్షా కాలంలో కూడా ఘాట్ రోడ్డులో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్మాణాలు చేస్తున్నారు. ఘాట్‌రోడ్డు చుట్టూ పెద్ద రాళ్లు ఉండడంతో భారీ వర్షాలకు అవి జారి పడకుండా స్టోన్పిచ్చింగ్చేస్తున్నారు. మట్టి కోతకు గురి కాకుండా, రాళ్లు జారి పడకుండా గేబిన్బ్యాగ్సిస్టంతో ఇనుప జాలీలు ఏర్పాటు చేస్తున్నారు.
స్టోన్స్లైడింగ్ జరిగినా ప్రమాదం లేకుండా ట్రెంచ్కట్టింగ్చేసి రోడ్డు నిర్మిస్తున్నారు. కాగా, ఘాట్‌రోడ్డు మధ్యలో రెండు కొండల మధ్య బాక్స్కల్వర్ట్ డిజైన్‌తో రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ, ఈ పద్ధతిలో రోడ్డు నిర్మిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇంజినీరింగ్ఆఫీసర్లు ఇటీవల సూచనలు చేశారు. దీంతో రెండు కొండల మధ్య అండర్వెంట్పాస్(యూవీపీ) లేదా మైనర్ బ్రిడ్జ్ (ఎంఎన్‌బీ) పద్ధతిలో రోడ్డు వేయాల్సి ఉంటుందని ఆర్‌అండ్‌బీకి ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం రాగానే రెండు కొండల మధ్య మిగతా పనులు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఘాట్‌రోడ్డులో కొండలు, రోడ్డకు మధ్య రెండున్నర మీటర్ల దూరం నుంచి నుంచి 15 మీటర్ల గ్యాప్‌తో రోడ్డు పనులు చేస్తున్నారు.
హెచ్‌టీ లైన్‌తో ఇబ్బందులు..
కురుమూర్తి క్షేత్రానికి ప్రారంభంలో ఉన్న విద్యుత్సబ్స్టేషన్సమీపం నుంచి గుట్ట మీది వరకు ఫ్లై ఓవర్‌ను నిర్మించాల్సి ఉంది. మొత్తం 27 పిల్లర్లతో ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయాల్సి ఉండగా, మొదట 11 పిల్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఆరు పిల్లర్లకు ఫుటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ ఆరింటికి కాంక్రీట్పనులు మొదలు పెట్టారు. మిగతా ఐదు పిల్లర్ల పనులు మొదలు పెట్టడానికి సబ్స్టేషన్నుంచి వెళ్లిన హై టెన్షన్(హెచ్‌టీ) లైన్ అడ్డుగా వస్తోంది. ఈ పనులు ముందుకు సాగాలంటే ఈ లైన్‌కు ఆల్టర్నేట్ లైన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందు కోసం విద్యుత్ శాఖకు ఆఫీసర్లు ఆల్టర్నేట్ లైన్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించారు. దీనికి ఆమోదం రాగానే మిగతా పిల్లర్ల పనులు మొదలు పెట్టనున్నారు.
కురుమూర్తి అభివృద్ధికి మరో రూ.70 కోట్లతో ప్రతిపాదనలు
యాదాద్రి తరహాలో కురుమూర్తి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే నా డ్రీమ్. ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్న. రూ.110 కోట్లతో నిర్మిస్తున్న ఘాట్ రోడ్డు నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయగా, పనులు జెట్ స్పీడులో జరుగుతున్నాయి. రానున్న బ్రహ్మోత్సవాల నాటికి వెనుక భాగం పనులు పూర్తి చేసి, ముందు భాగం పనులు వచ్చే జూన్ వరకు పూర్తి చేస్తాం. మహా మండపం కోసం డ్రాయింగ్స్ పూర్తయ్యాయి. ఈ మండపంలోనే క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తాం. భక్తులు కూర్చోవడానికి వీలుగా వసతులు కల్పిస్తాం. రూ.73 లక్షలతో షెడ్డు నిర్మాణం కంప్లీట్అయ్యింది. మరో రూ.70 కోట్లతో కాటేజీలు, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశాం.
-జి.మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర
