వేదనాభరిత జీవితాలని చూపించే కోర్టు కథలు

వేదనాభరిత జీవితాలని చూపించే కోర్టు కథలు

సినిమాల్లో కోర్టు వాతావరణం చూసి చాలా మంది కోర్టులు అలా ఉంటాయని అనుకుంటారు. కోర్టు వాతావరణాన్ని సినిమా వాళ్లు దారుణంగా చూపిస్తూ ఉంటారు. అలాంటి సినిమాలు చూసి అదే విధంగా కథలు రాస్తున్న రచయితలూ ఉన్నారు.

నేర న్యాయవ్యవస్థతో సంబంధం ఉన్న రచయితలు, న్యాయవాదులైన రచయితలు, న్యాయమూర్తులైన రచయితలు కోర్టుకు సంబంధించిన కథలు, నవలలు రాసినప్పుడు అలా ఉండదు. కోర్టుల్లో ఉండే పరిస్థితిని ఆ కథల్లో, నవలల్లో మనం చూడవచ్చు. అయితే తెలుగులో నాకు తెలిసి అలాంటి రచయితలు తక్కువ. రావిశాస్త్రి, చీనాదేవి, నందిగం క్రిష్ణారావు, జింబోలను పేర్కొనవచ్చు. కోర్టులో పని చేసిన యన్.కె. రామారావును కూడా పేర్కొనవచ్చు. ఆయన రాసిన కథలు తక్కువే అయినప్పటికీ, ఓ రెండు కథల్లో నేరన్యాయవ్యవస్థని చూపించారు. మిగతా రచయితల గురించి చెప్పాల్సిన పనిలేదు. చాలా కథల్ని వాళ్లు రాశారు.

రావిశాస్త్రి గారి గురించి మాట్లాడినప్పుడు అందరికీ వెంటనే గుర్తుకొచ్చే కథ ‘మామ’.
మద్యపాన నిషేధం ఉన్న కాలంలో హెడ్డుకీ సారా అమ్మే ముత్యాలమ్మకి ఓ గొడవ జరిగి ఆమె మీద తప్పుడు సారా కేసు పెడతారు. కొత్తగా న్యాయవాద వృత్తిలో చేరిన మూర్తి ఆమె కేసుని వాదిస్తాడు. కేసు గెలుస్తానన్న ఊపులో ఉంటాడు. ‘హెడ్డు బాబు తేలగొట్టేస్తాడు అనుకున్నానులే’ అంటుంది ముత్యాలమ్మ మూర్తితో. మూర్తి ఆశ్చర్యపోయి ఆమెను ప్రశ్నిస్తాడు. ఆమె హెడ్డుకి ఆమెకు జరిగిన రాజీ గురించి వివరిస్తుంది. 
మంచు వీడిపోయినట్టుగా కేసంతా ఎందుకు సులభంగా విడిపోయిందో అర్థమయ్యేసరికి బుంగలోంచి గాలిపోయినట్టు చప్పబడి పోతాడు మూర్తి. సిగ్గుపడి ముత్యాలమ్మ ఇచ్చే డబ్బుని తీసుకోడు. మూర్తికి అంతా అసందర్భంగానూ, కనికట్టుగానూ, మాయగానూ తోస్తుంది.
సారా అసలు దొరకలేదు. దొరికిందని కేసు పెట్టారు. దొరకలేదని తేలగొట్టేశారు. 

కోర్టుల్లో కేసులు ఏ విధంగా నమోదవుతాయి. ఎట్లా వీగిపోతాయి అన్న దానికి నిదర్శనం ఈ కథ.
నందిగం క్రిష్ణారావు రాసిన ‘పోలీసుదేముడు’ కథలో కోర్టు వాతావరణం కనిపిస్తుంది.
దేవుని గుడిలో దొంగతనం చేశాడన్న ఆరోపణతో మల్లికార్జునరావు మీద కేసు పెడతారు. అర్ధరాత్రిపూట సాక్షులు ఎవరూ లేనందున కానిస్టేబుల్​నే సాక్షిగా పెడతాడు ఇన్​స్పెక్టర్. దేవుడికి కూడా సెక్యూరిటీ అవసరం ఏర్పడుతుందని ఇన్​స్పెక్టర్​ సాక్ష్యం చెబుతాడు. కానిస్టేబుల్స్ అదే విధంగా సాక్ష్యం చెబుతారు.
తనని అకారణంగా అరెస్టు చేశారని, అదీ బస్టాపులోనని లంచం ఇవ్వలేదన్న కారణంగా కేసు పెట్టారనేది ముద్దాయి వాదన. కేసు విచారణ పూర్తి అవుతుంది. దైవభక్తి బాగా ఉన్న మేజిస్ట్రేట్ ముద్దాయికి తాను ఎంత శిక్ష వేయవచ్చో అంతశిక్షని విధిస్తాడు. ముద్దాయి జైలుకు వెళ్లిపోతాడు.

ఆ మెజిస్ట్రేట్ ఆ ఊరికి కొత్తగా వచ్చాడు. ఆ గుడిని దర్శించి దండం పెట్టుకుందామని ఆ కేసులో చెప్పిన ములుగు రోడ్డుకి వెళ్తాడు. అతని వెంట కొంత మంది న్యాయవాదులు కూడా వెళ్తారు. ఆ రోడ్డులో గుడి జాడ ఎక్కడా కనిపించదు. గుడిని కూడా దొంగతనం చేశారా? అని అనుకుందామంటే అలాంటి ఆనవాళ్లు కనిపించవు. అక్కడెక్కడా గుడి ఉన్న దాఖలాలు కూడా గోచరించవు. చుట్టుపక్కల వాళ్లను విచారిస్తే అక్కడ గుడి లేదని చెబుతారు. పోలీసులు ఇంత పెద్ద అబద్ధం ఆడతారా అనుకొని కేసు పెట్టిన పోలీసులను కనుక్కోమని తనతో వచ్చిన న్యాయవాదులతో చెప్తాడు.

అక్కడ గుడిలేదని, ఆ కేసులోనే గుడి ఉందని పోలీసులు చెప్తారు. మెజిస్ట్రేట్ తెల్లబోతాడు. ఇంటికి తిరిగి వస్తూ పోలీస్​స్టేషన్ ముందు తన వాహనాన్ని ఆపి, దేవుడి గుడినే సృష్టించిన పోలీసులకి దండం పెడతాడు.
ఈ కథలో అంతా కోర్టు వాతావరణం ఉంటుంది.  ఎక్కడా ఆ వాతావరణం చెడిపోదు.
ఈ కథ యన్.కె. రామారావు రాసిన ‘ఉందిలే మంచి కాలం’. ఇది కూడా పోలీసుల ప్రవర్తనని, వాళ్లు చేసే దుర్మార్గాలని వేలుపెట్టి చూపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులని కూడా పోలీసులు ఎట్లా సతాయిస్తారో ఈ కథలో చెప్తాడు రచయిత.

డాక్టర్ ప్రభావతికి వృత్తి పట్ల నిబద్ధత ఎక్కువ. ప్రైవేట్ ప్రాక్టీస్ చేయదు. భర్త ఒత్తిడి చేసినా ఆమె వినదు. చివరికి భర్త ఆమెను వదిలివేసి సిటీలో ఓ అమ్మాయితో కాపురం పెడతాడు. ఆమెకు 35 సంవత్సరాలుంటాయి.
అందంగా ఉంటుంది. తన డ్యూటీ తాను చేసుకుంటుంది.

ఇన్​స్పెక్టర్ కోరినట్టుగా సర్టిఫికెట్లు ఆమె ఇవ్వదు. ఓ అమ్మాయి చనిపోయినప్పుడు ఆమె ఒంటి మీద గాయాలు ఉన్నాయని సర్టిఫికెట్ ఇవ్వమని అడుగుతాడు. ఆమె నిరాకరిస్తుంది. పోలీసు అధికారి ఆమెను బెదిరిస్తాడు. ఇది విన్న ఆమె అంతరాత్మని చిలకలా మాట్లాడిస్తాడు రచయిత. లోకాన్ని బట్టి నడుచుకొమ్మని సలహా ఇస్తుంది. ప్రభావతి చిలక మీద విసుక్కుంటుంది. చిలక లోపలికి వెళ్లిపోతుంది. మరోసారి తీవ్ర గాయాలు ఉన్న వ్యక్తికి మామూలు గాయాలు ఉన్నట్లు సర్టిఫికెట్ అడుగుతాడు. ఆమె నిరాకరిస్తుంది. మొగుడులేని దానివి తన కోసం ఓ అరగంట స్పేర్ చేయమంటాడు.‘షటప్ అండ్ గెటౌట్’ అంటుంది. సర్టిఫికెట్ ఇవ్వమంటే గొడవ చేస్తోందని ఆ పోలీసు అధికారి హాస్పిటల్ సిబ్బందికి చెబుతాడు. రాత్రికి గెస్ట్ హౌస్ కి రమ్మని చిన్న ఉత్తరం పంపిస్తాడు. లేకపోతే తీవ్ర పరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తాడు. ఆదర్శాలని వదిలి పెట్టమంటుంది చిలక. ఆమె వినదు.
ఒకరోజు డ్యూటీ టైంలో మెజిస్ట్రేట్ భార్య ఆరోగ్యం బాగాలేదని చూడటానికి రమ్మని కోర్టు అటెండర్ వస్తాడు. ఆమెనే అక్కడికి తీసుకొని రమ్మని చెప్తుంది. ‘దొరవారు పిలిస్తే రానందా? దాన్ని జైలుకి పంపించకపోతే పోలీసు ఉద్యోగానికే తాను పనికిరాన’ని అంటాడు ఇన్​స్పెక్టర్.

చివరికి ఓ అబద్ధపు కేసులో ఆమెను ఇరికిస్తాడు. బలమైన సాక్ష్యాలు పెడతాడు. డబ్బుకోసం చేయకూడని పని నెత్తిమీద పెట్టుకొని నిర్లక్ష్యంగా చంపిందని ఆమె మీద కేసు. అది అబద్ధపు కేసని మెజిస్ట్రేట్​కి తెలుసు. సాక్ష్యమా? ధర్మమా? అన్న మీమాంసలో ఉంటాడు. ఉద్యోగధర్మంలో చేసిన తప్పుకి ప్రభుత్వ అనుమతి ఉండాలి. ఈ కేసులో అది లేదన్న సాంకేతిక కారణంగా ఆమెపై ఉన్న కేసుని కొట్టివేస్తాడు మెజిస్ట్రేట్.

చిలక ఉన్న లేడీ డాక్టర్, చట్టం చట్రంలో చిక్కుకున్న మెజిస్ట్రేట్, పోలీసుల ఆధిపత్య ధోరణి ఇవన్నీ ఈ కథలో కనిపిస్తాయి. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ జీవితంలో దెబ్బలు తింటున్న నీకు నా అవసరం లేదు అని చిలక ఎగిరిపోతుంది.

ఈ కథ ఓ చిన్న పట్టణంలో జరిగే విషయాలకి అద్దం పడుతుంది. చివరగా జింబో రాసిన ‘ఫైలు శ్వాస’ కథ. ఈ కథని కాగితం చెబుతుంది. వెదురుబొంగు కాగితంగా మారిన వైనం.. కాగితం ఫైలుగా మారిన స్థితి ఈ కథలో కనిపిస్తుంది. కాగితాల కట్ట మొదట పోలీస్​స్టేషన్​కి వస్తుంది. అక్కడ అది ఎఫ్.ఐ.ఆర్, రిమాండ్ రిపోర్టు, ఆ తరువాత చార్జిషీట్ కావడం కోర్టులో ఓ ఫైల్​గా మారడమూ జరుగుతుంది. మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సెషన్స్ కోర్టుకి ఆ ఫైలు ఎలా వెళ్తుందన్న విషయాలన్నీ కథలో మనకు కనిపిస్తాయి. ముద్దాయిలని ప్రశ్నించే వైనం, సాక్షుల విచారణ, కేసులోని వాదోపవాదాలు జరిగి కేసు తీర్పుకోసం వస్తుంది.

ఒకరోజు ఉదయం కేసు ఫైలుని బాక్స్ నుంచి బయటకు తీసి జడ్జి స్టెనోకి తీర్పుని డిక్టేట్ చేస్తాడు. టైప్ చేసి ఇచ్చిన కాగితాలని ఆ ఫైల్లో పెడతాడు. తీర్పు సారాంశం కేసు రుజువు కాలేదని.
తీర్పు సారాంశం అర్థమైన తరువాత ఫైలుకి కోపం వస్తుంది. ఈ మాత్రం తీర్పుని ప్రకటించడానికి ఇన్ని సంవత్సరాలా? జడ్జిని ప్రశ్నించాలని నిర్ణయం తీసుకుంటుంది ఫైలు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో జడ్జి టిఫిన్ చేసి ఫైలుని తెరుస్తాడు.

ఫైలు గొంతు సవరించుకొని ‘‘యువరానర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి’’ అంటుంది.
జడ్జి ఆశ్చర్యపోతాడు. భయకంపితుడు అవుతాడు. ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాదు. చివరికి ఫైలు మళ్లీ తాను మాట్లాడుతున్నానన్న విషయం చెబుతుంది. జవాబు తెలిసీ చెప్పకపోతే బాగుండదని బేతాళుని శవంలా హెచ్చరిస్తుంది. 

‘‘ఈ కేసులో నలుగురు నేరం చేయలేదని ఎస్ఐ, ఇన్​స్పెక్టర్​, మెజిస్ట్రేట్​, సెషన్స్ జడ్జి, కేసుని విచారించిన మీకూ తెలుసు. అయినా వీళ్లని ఎందుకు బందీ చేశారు?” ప్రశ్నిస్తుంది ఫైలు.
‘‘వాళ్లు నక్సలైట్ సానుభూతి పరులు. కానీ, ఈ నేరంతో వాళ్లకు సంబంధం లేదు. సాక్ష్యాధారాలు లేవు. అయినా పోలీసులు అరెస్టు చేశారు. మెజిస్ట్రేట్ రిమాండ్ చేశారు. పోలీసులు చార్జిషీట్​ను దాఖలు చేశారు. మేం విచారణ చేశాం. అందరికీ అన్నీ తెలుసు. అయినా కేసు విచారణ జరిగింది ఈ ఆరు సంవత్సరాలుగా. ‘‘కేసులు నిలవాలని పెట్టరు. మనిషిని వంగతీయడానికి పెడతారు’’ ఇలా జవాబు చెబుతాడు జడ్జి.
నేరన్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది. మనుషులని లొంగతీయడానికి కేసులు ఎలా తయారవుతాయి. మనషులు కేసు ఫైల్లో ఎలా బందీ అవుతారు. ఇవన్నీ ఈ కథలో కనిపిస్తాయి.

ఈ నలుగురు రచయితలకి కోర్టులతో, కేసులతో సంబంధాలు ఉన్నాయి. పోలీసులు ఎలా ఉంటారు, నేర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసు. అందుకే ఈ కథలు సహజత్వానికి దగ్గరగాఉన్నాయి. తమకు తెలిసిన జీవితాన్ని వాళ్లు కథల్లో చూపించారు. అందుకే ఈ కథలు దృశ్యాలుగా కనిపిస్తాయి. దృశ్యరూపంలో కనిపించి మనస్సుకి హత్తుకుంటాయి. జీవితం ఇంత వేదనాభరితమా అని భయం కూడా వేస్తుంది. సినిమాలకి భిన్నమైన కథలు ఇవి.
తాము చూడని జీవితం గురించి అద్భుతంగా చెప్పిన రచయితలూ ఉన్నారు. అయితే వాళ్ల సంఖ్య తక్కువ. 

మంచు వీడిపోయినట్టుగా కేసంతా ఎందుకు సులభంగా విడిపోయిందో అర్థమయ్యేసరికి బుంగలోంచి గాలిపోయినట్టు చప్పబడి పోతాడు మూర్తి. సిగ్గుపడి ముత్యాలమ్మ ఇచ్చే డబ్బుని తీసుకోడు.

- డా. మంగారి రాజేందర్ , కవి, రచయిత

Note:  ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.