మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్, RTO రిజిస్ట్రేషన్ అవసరం లేని ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం ఇలాంటి తక్కువ స్పీడ్ వాహనాల కోసం నియమాలను చాలా సులభం చేసింది. దీనివల్ల ఎలాంటి లైసెన్స్ టెస్టులు లేకుండా, RTO ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఇన్సూరెన్స్ ఖర్చులు లేకుండానే మీరు హ్యాపీగా ప్రయాణించవచ్చు. అసలు RTO అవసరం లేని ఎలక్ట్రిక్ స్కూటర్లు అంటే ఏమిటి.. వీటివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి.. ఇవి ఎవరికి బాగా ఉపయోగపడతాయి చూద్దామా...
ఏ స్కూటర్లకు RTO రూల్స్ వర్తించవు
కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే వెళ్తుందో, దాని మోటార్ కెపాసిటీ 250 వాట్స్ లేదా అంతకంటే తక్కువ ఉంటుందో, దానికి RTO పర్మిషన్ అవసరం లేదు. ఈ స్కూటర్లను తయారు చేసేటప్పుడే కంపెనీలు వాటి వేగాన్ని 25 కి.మీ దాటకుండా లాక్ చేస్తాయి. మీరు ఎంత ఆక్సిలరేటర్ ఇచ్చినా అవి అంతకంటే స్పీడ్ వెళ్లవు. ఒకవేళ స్కూటర్ వేగం గానీ, మోటార్ పవర్ గానీ దీనికంటే ఎక్కువగా ఉంటే.. దానికి ఖచ్చితంగా పెట్రోల్ బండిలాగే నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరమవుతాయి.
RTO-అవసరం లేని స్కూటర్ వల్ల ప్రయోజనాలు
సాధారణ వాహనాలతో పోలిస్తే RTO అవసరం లేని ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం వల్ల చాలా ఖర్చులు కలిసివస్తాయి. లైసెన్స్ అవసరం లేదు.. డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్టు రాయాల్సిన పని లేదు, ఎటువంటి ఫీజులు కట్టక్కర్లేదు ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు కాబట్టి RTO ఆఫీసులో నంబర్ ప్లేట్ కోసం పెట్టే రూ. 1,500 నుండి రూ. 3,000 ఖర్చు తప్పుతుంది.
►ALSO READ | గూగుల్‌లో మీరు ఎప్పటికీ వెతకకూడని 5 విషయాలు ఇవే.. ఎందుకో తెలుసా !
చాలా రాష్ట్రాల్లో ఇలాంటి చిన్న ఈవీ (EV) బండ్లపై ఎలాంటి రోడ్డు ట్యాక్స్ ఉండదు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన రూల్ వీటికి వర్తించదు. షోరూమ్‌లో దీని ఎక్స్-షోరూమ్ ధర, ఆన్-రోడ్ ధర దాదాపు ఒకేలా ఉంటాయి, ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు.
ఈ స్కూటర్లు ఎవరికి బాగా ఉపయోగపడతాయంటే
ఈ తక్కువ స్పీడ్ స్కూటర్లు సిటీ నగరాల్లో, ఊర్లలో చిన్న చిన్న అవసరాలకు తిరగడానికి పర్ఫెక్ట్ ఛాయిస్. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు లేదా కోచింగ్ సెంటర్లకు వెళ్లే 16 ఏళ్లు పైబడిన విద్యార్థులు, టీనేజర్లకు ఇది చాలా సేఫ్. వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు ఎలాంటి శ్రమ లేకుండా, తక్కువ వేగంతో ప్రశాంతంగా ప్రయాణించవచ్చు. ఇంటి చుట్టుపక్కల 4 నుండి 10 కిలోమీటర్ల పరిధిలో కూరగాయలు, కిరాణా సామాన్లు తేవడానికి మహిళలకు బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా తక్కువ దూరంలో డెలివరీలు చేసే డెలివరీ బాయ్స్ కి ఖర్చులు మిగులుతాయి. ఇప్పటివరకు ఎలాంటి టూ-వీలర్ నడపని కొత్తగా నేర్చుకునేవారు, లైసెన్స్ లేని వారు ఈజీగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు.
పెరుగుతున్న పెట్రోల్ ధరల నుండి రిలీఫ్ పొందడానికి, ప్రశాంతంగా ప్రయాణించడానికి RTO అవసరం లేని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక అద్భుతమైన మార్గం. ఇంట్లోనే ప్లగ్ పెట్టి చార్జింగ్ చేసుకుంటూ, ప్రతిరోజూ పెట్రోల్ డబ్బును ఆదా చేసుకోవడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
