గూగుల్‌లో మీరు ఎప్పటికీ వెతకకూడని 5 విషయాలు ఇవే.. ఎందుకో తెలుసా !

గూగుల్‌లో మీరు ఎప్పటికీ వెతకకూడని 5 విషయాలు ఇవే..  ఎందుకో తెలుసా !

ఈ రోజుల్లో గూగుల్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఏదైనా సమాచారం, వస్తువులు లేదా సలహాల కోసం గూగుల్‌లో వెతుకుతుంటారు. అడిగిన వెంటనే సమాధానం దొరుకుతుంది కాబట్టి మనం దీనిపై ఎక్కువగా ఆధారపడతాం. కానీ, గూగుల్‌లో అన్ని విషయాలను వెతకడం సేఫ్  కాదు. కొన్నిటిని వెతకడం వల్ల మీరు మోసాల్లో చిక్కుపోవచ్చు, మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించవచ్చు లేదా మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడొచ్చు. కాబట్టి, గూగుల్‌లో ఎప్పటికీ వెతకకూడని 5 ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి:

1. కస్టమర్ కేర్ నంబర్లు
చాలామంది ఏదైనా సమస్య వస్తే వెంటనే గూగుల్‌లో బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ లేదా ఆన్ లైన్ హెల్ప్‌లైన్ నంబర్ అని వెతుకుతుంటారు. మోసగాళ్లు ఇలాంటి నంబర్ల కోసం నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి, గూగుల్‌లో కనిపించేలా చేస్తారు. మీరు ఆ నంబర్లకు ఫోన్ చేస్తే, కంపెనీ వాళ్లమని నమ్మించి మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు అడిగి డబ్బులు గుంజేస్తారు. అందుకే ఏదైనా ఫోన్ నంబర్ కావాలంటే, డైరెక్ట్  అఫీషియల్  వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో మాత్రమే తీసుకోవాలి.

2. ఫ్రీ సాఫ్ట్‌వేర్, యాప్ డౌన్‌లోడ్‌లు
 ఫ్రీ సాఫ్ట్‌వేర్  లేదా క్రాక్డ్ సాఫ్ట్‌వేర్ అని గూగుల్‌లో వెతకడం చాలా ప్రమాదకరం. ఇలాంటి లింక్స్ ద్వారా మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి వైరస్, స్పైవేర్ లేదా రాన్సమ్‌వేర్ వంటి హానికరమైన వైరస్‌లు రావొచ్చు. ఇవి మీ పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేస్తాయి. అందుకే మీకు కావాల్సిన యాప్స్ లేదా సాఫ్ట్‌వేర్‌ను కేవలం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్  యాప్ స్టోర్ లేదా అఫీషియల్ కంపెనీల అధికారిక సైట్ల నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి.

3. సొంత వైద్యం
ఒంట్లో బాగోలేనప్పుడు లేదా తలనొప్పి, కడుపునొప్పి వచ్చినప్పుడు చాలామంది గూగుల్‌లో  లక్షణాలను టైప్ చేసి వెతుకుతారు. అక్కడ వచ్చే రకరకాల సమాచారం చదివి...నాకు ఏదో జబ్బు చేసింది అని లేనిపోని టెన్షన్ తెచ్చుకుంటారు. గూగుల్ అనేది డాక్టర్ కాదు, అది కేవలం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారాన్ని చూపిస్తుంది. మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు గూగుల్‌లో వెతికి భయపడేకంటే, నేరుగా ఒక మంచి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

►ALSO READ | రూపాయి పతనం, అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కరుగుతున్న విదేశీ పెట్టుబడులు.. 2.87 లక్షల కోట్లు వెనక్కి!

4. ఈజీగా డబ్బులు సంపాదించే చిట్కాలు 
మీ డబ్బులు వెంటనే  డబుల్ అవ్వాలా ?.. రోజుకు ఐదు గంటలు  పనిచేస్తే చాలు వేలల్లో సంపాదన.. గ్యారెంటీ లాభాలు ఇచ్చే స్టాక్ టిప్స్ అని గూగుల్‌లో వెతికితే మీరు ఖచ్చితంగా మోసపోతారు. ఇలాంటివి మిమ్మల్ని నకిలీ క్రిప్టో కరెన్సీ స్కీమ్‌లు, పాంజీ స్కీమ్‌లు (Ponzi schemes), ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్ వైపు తీసుకెళ్తాయి. వీటిని నమ్మి డబ్బులు పెడితే ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. డబ్బులు దాచుకోవాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా సెబీ (SEBI) రిజిస్టర్డ్ ఆర్థిక సంస్థల సలహాలను మాత్రమే తీసుకోండి.

5. మీ సొంత వ్యక్తిగత సమాచారం
మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఆధార్ కార్డ్ లేదా ఇతర వ్యక్తిగత వివరాలను గూగుల్‌లో టైప్ చేసి వెతకకండి. మీ డేటా ఇంటర్నెట్‌లో ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవడం మంచిదే కానీ, అనుమానాస్పద సైట్లలో మీ సమాచారం కనిపిస్తే వాటిని క్లిక్ చేయకూడదు. దీనివల్ల హ్యాకర్లకు మీ వివరాలు సులభంగా దొరికిపోయే అవకాశం ఉంది.

ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ కొత్త కొత్త విధంగా పెరిగిపోతున్నాయి. ఒక చిన్న తప్పుడు క్లిక్ వల్ల మీ బ్యాంక్ అకౌంట్  ఖాళీ అయిపోవచ్చు. కాబట్టి గూగుల్‌లో ఏదైనా లింక్‌ను క్లిక్ చేసే ముందు వెబ్‌సైట్ అడ్రస్ (URL) కరెక్ట్‌గా ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.