- వారాసిగూడ, అడ్డగుట్ట బస్తీల్లో ఐసీఎంఆర్ ఎన్ఐఎన్, లండన్‌కు చెందిన రాయల్ ఇన్‌స్టిట్యూట్ రీసెర్చ్
- పాలు. నీళ్ల నమూనాలు, పశుగ్రాసం శాంపిల్స్ సేకరణ
- పాలలో యూరియా, డిటర్జెంట్లు, పాలపొడి, క్లోరిన్ వంటి హానికర రసాయనాలు కలుపుతున్నట్టు గుర్తింపు
- పచ్చి పాలలో ఎస్చెరిచియా కోలి, సాల్మొనెల్లా, స్టెఫిలోకాకస్ ఆరియస్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా
- పాల సేకరణ కేంద్రాల్లో వాడే నీటిలో 70 శాతం మల సంబంధ బ్యాక్టీరియా
- పశువుల మేతలో అఫ్లాటాక్సిన్ అనే విషపూరిత పదార్థం
- పాలు తాగే చిన్నారులకు తరచూ డయేరియా
- పిల్లలు వయసుకి తగ్గ ఎత్తు పెరగడంలేదని స్పష్టం చేసిన స్టడీ
హైదరాబాద్, వెలుగు: పాలంటే పిల్లల పాలిట అమృతం. ఎముకల పుష్టికి కావాల్సిన కాల్షియం, మెదడు వికాసానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లను అందించి వారిని ఆరోగ్యంగా ఎదిగేలా చేయాలి. కానీ, హైదరాబాద్ సిటీలోని బస్తీల్లో పంపిణీ అవుతున్న పాలు అనారోగ్యానికి కారణం అవుతున్నాయనే షాకింగ్ విషయం తాజా రీసెర్చ్‌లో బయట పడింది. హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), లండన్‌కు చెందిన రాయల్ వెటర్నరీ కాలేజీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా పాల సరఫరా వ్యవస్థపై రీసెర్చ్ చేశారు. సిటీలోని అడ్డగుట్ట, వారాసిగూడ ప్రాంతాల్లో పాల నాణ్యత ఎలా ఉంది? అవి చిన్నారుల ఎదుగుదలపై ఎలా ప్రభావం చూపుతున్నాయి? అనే వివరాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు 42 పాల శాంపిల్స్, 24 పశుగ్రాసం శాంపిల్స్, 20 నీటి శాంపిల్స్ సేకరించి మైక్రోబయోలాజికల్ టెస్టులు చేశారు.
పచ్చి పాలల్లో బ్యాక్టీరియా..
రీసెర్చ్‌లో భాగంగా సేకరించిన పచ్చిపాల (అన్‌పాశ్చరైజ్డ్ మిల్క్) శాంపిల్స్‌లో ఎస్చెరిచియా కోలి (ఈ కోలి), సాల్మొనెల్లా, స్టెఫిలోకాకస్ ఆరియస్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు ల్యాబ్ టెస్టుల్లో తేలింది. ముఖ్యంగా గేదె పాల సేకరణ కేంద్రాల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఏకంగా 57 శాతం మేర ఉండటం గమనార్హం. ఆవు పాలతో పోలిస్తే గేదె పాలల్లోనే కాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాల వల్ల చిన్నారులకు తరచూ డయేరియా, వాంతులు అవ్వడమే కాకుండా, వారి రోగనిరోధక శక్తి పడిపోయే ప్రమాదం ఉంది. చిన్నారులు ఇప్పుడిప్పుడే రోగనిరోధక శక్తి పెంచుకునే దశలో ఉండటం వల్ల, ఇటువంటి కలుషిత పాలు వారి ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతున్నాయని ఈ స్టడీ తేల్చింది.
దొడ్లలోని నీటిలోనూ..
పాల సరఫరాలో కేవలం పాలే కాదు, అందులో కలిపే నీరు కూడా చిన్నారుల ప్రాణాల మీదికి తెస్తోంది. పాల సేకరణ కేంద్రాల్లో(పశువుల దొడ్లు) గిన్నెలు కడగడానికి, పాలను పల్చబరచడానికి వాడుతున్న నీటిని పరీక్షించగా భయంకరమైన నిజాలు తెలిశాయి. దాదాపు 70 శాతం నీటి నమూనాల్లో మల సంబంధిత బ్యాక్టీరియా ఉన్నట్టు రిపోర్ట్ పేర్కొంది. మున్సిపల్ ద్వారా వచ్చే క్లోరినేటెడ్ నీటితో పోలిస్తే, నిల్వ ఉంచిన నీరు, బోరు బావుల నీటిలోనే ఈ కాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మన దేశంలో 96 శాతం మంది పాలను మరిగించి తాగుతారు కాబట్టి బ్యాక్టీరియా చనిపోవచ్చు కానీ, నీటి ద్వారా కలిసే రసాయన మలినాలు, బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్లు మాత్రం అలాగే ఉండిపోతాయని, అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులుహెచ్చరిస్తున్నారు.
పశువుల మేతలో అఫ్లాటాక్సిన్..
పశువులకు అందించే దాణా విషయంలోనూ ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. 67 శాతం పశుగ్రాసం నమూనాల్లో అఫ్లాటాక్సిన్ అనే విషపూరిత పదార్థం ఉన్నట్టు గుర్తించారు. ఫంగస్ వల్ల వచ్చే ఈ విషం పశువుల పొట్టలోకి చేరి, అక్కడ మెటబోలైజ్ అయ్యి పాల ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంది. పరీక్షించిన అన్ని నమూనాల్లో ఈ అఫ్లాటాక్సిన్ పరిమాణం భారత ప్రభుత్వం నిర్ణయించిన చట్టపరమైన పరిమితుల లోపు మాత్రమే ఉంది. అంటే ఇది నిబంధనలను మించలేదు. కానీ, దీర్ఘకాలంలో పాల నాణ్యతపై, చిన్నారుల ఎదుగుదలపై దీని ప్రభావం ఉండవచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పశువులకు ఇచ్చే మేతలో నాణ్యత లేకపోవడం వల్ల పాలలో పోషకాల శాతం పడిపోతోందని తేల్చారు.
కల్తీకి మూలం ఆర్థిక ఇబ్బందులే..
పాల సరఫరా వ్యవస్థలో నీతి, నియమాల కంటే కేవలం నమ్మకం మీదనే వ్యాపారం సాగుతోందని ఈ సర్వే తేల్చింది. పాడి రైతులకు పశుగ్రాసం ధరలు పెరగడం, పశువుల వైద్య ఖర్చులు భారం కావడంతో వారు తీవ్రమైన ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటున్నారు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి, పాలు విరగకుండా ఉండటానికి, పరిమాణం పెంచడానికి యూరియా, డిటర్జెంట్లు, పాలపొడి, క్లోరిన్ వంటి హానికరమైన రసాయనాలను వాడుతున్నట్టు పరిశోధకుల దృష్టికి వచ్చింది. పెద్ద డెయిరీ కంపెనీలకు ఉన్న ఆధిపత్యం వల్ల చిన్న రైతులకు సరైన లాభాలు రాకపోవడం, వారి వద్ద పాలను భద్రపరిచేందుకు సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడం పాల నాణ్యతను పాడుచేస్తోంది. కేవలం కంటితో చూసి పాలు బాగున్నాయని నమ్మడమే తప్ప, శాస్త్రీయంగా నాణ్యతను పరీక్షించే వ్యవస్థ లేదని నివేదిక స్పష్టం చేసింది.
జవాబుదారీతనం పెరగాలి..
ఈ స్టడీ నేరుగా చిన్నారుల ఎత్తును కొలిచి పాలకు, స్టంటింగ్ కు ప్రత్యక్ష సంబంధాన్ని నిరూపించనప్పటికీ.. పాల సరఫరా వ్యవస్థలోని లోపాలు చిన్నారుల ఎదుగుదలను దెబ్బతీసే పెద్ద ముప్పు అని హెచ్చరించింది. సిటీలోని బస్తీల్లో నివసించే పేద ప్రజలకు పాల నాణ్యతను తనిఖీ చేసే అవగాహన లేకపోవడం కల్తీ వ్యాపారులకు వరంగా మారుతోంది. ప్రభుత్వం ఆహార భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని, రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన మేత, వైద్య సదుపాయాలు అందిస్తేనే ఈ వ్యవస్థ మెరుగుపడుతుందని రిపోర్ట్ సూచించింది. పసిపిల్లల భవిష్యత్తు దృష్ట్యా మనం తాగే పాలు స్వచ్ఛంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.
‘చిన్నారుల జీవితంలో మొదటి 1000 రోజులు ఎంతో కీలకం. ఈ దశలో వారి ఎత్తు, బరువును నిర్ణయిస్తాయి. కానీ, పాలలో ఉన్న హానికర బ్యాక్టీరియా వల్ల పిల్లల పేగులు దెబ్బతింటాయి. దీనివల్ల పిల్లలు మంచి ఆహారం తిన్నా, ఆ పోషకాలను వారి శరీరం గ్రహించదు. ఫలితంగా వయసు పెరుగుతున్నా పిల్లలు ఎత్తు పెరగకుండా కుచించుకుపోతారు’ అని స్టడీ రిపోర్ట్హెచ్చరించింది. పాడి రైతులకు నాణ్యమైన పశుగ్రాసం అందుబాటులోకి తేవడం, పశువుల వైద్య ఖర్చులను తగ్గించడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఈ నివేదిక సూచించింది.
