మొన్నటివరకు దేవాలయాల మకరతోరణాలు, ధ్వజస్తంభాల ఇత్తడి తొడుగులు, దేవతామూర్తుల అలంకారాలకే పరిమితమైన పెంబర్తి కళ ఇప్పుడు కాలానుగుణంగా కొత్త రూపం దాల్చింది. కళాకారులు ప్రజల కొత్త అభిరుచులు, ఆసక్తికి అనుగులణంగా తమ కళకు కొత్త నగిషీలు దిద్దుతున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ రంగాల అవసరాలకు అనుగుణంగా కొత్త కళాఖండాలను రూపొందించి సక్సెస్ అయ్యారు. సంప్రదాయ ఇత్తడి చెక్కుడు కళకు కొత్తదనాన్ని జోడిస్తూ జ్యువెలరీ, వాల్ డెకర్‌లు, ల్యాంప్‌షేడ్లు, హోమ్ డెకర్ వస్తువులు రూపొందించి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లను ఆకర్షిస్తున్నారు.
కొంతకాలం నుంచి సంప్రదాయ ఇత్తడి కళాఖండాలకు డిమాండ్ తగ్గింది. ఆర్డర్లు లేక కళాకారులకు పని లేకుండా పోయింది. దీంతో పెంబర్తిలో తమ మెటల్ కళ అంతరించిపోతుందని కళాకారులు కంగారుపడ్డారు. అదే టైంలో హైదరాబాద్ జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్ ప్రాజెక్టు కోసం పెంబర్తి మెటల్ హ్యాండీక్రాఫ్ట్‌కు వచ్చి ఇత్తడితో ఫ్యాషన్ డిజైనింగ్ జ్యువెలరీ చేయాలని కోరారు.
అంతే ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ డిజైన్ చేసిన వివిధ రకాల ఆభరణాల తయారీ మొదలుపెట్టారు కళాకారులు. చేతితో చెక్కిన సూక్ష్మమైన ఆకృతులు, తెలంగాణ జానపద కళా ముద్రలు, నెమళ్లు, పూలు, ఆలయ శిల్పాల నమూనాలతో తయారయ్యే ఇత్తడి జ్యువెలరీ ప్రతి ఆభరణాన్ని ఓ కళాఖండంగా నిలబెడుతోంది. తక్కువ ధరలో ఆకర్షణీయమైన లుక్‌ను అందించడంతోపాటు పర్యావరణ హితమైన ఫ్యాషన్ ఉత్పత్తిగా కూడా ఇవి గుర్తింపు పొందుతున్నాయి.
దాదాపు 800 ఏళ్ల చరిత్ర
భారతదేశపు ప్రాచీన కళల్లో ఒకటైన లోహపు కళ వేల సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. కంచు, ఇత్తడి వంటి లోహాలు, మిశ్రమ లోహాలను కళాఖండాల తయారీకి అనాదిగా ఉపయోగిస్తున్నారు. పెంబర్తి లోహపు కళ అనేది జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామంలో తయారయ్యే ఒక ప్రసిద్ధ హస్తకళ. ఇక్కడ తయారయ్యే క్లిష్టమైన రేకు లోహపు ఇత్తడి చెక్కడాలు, కళాఖండాలు 800 సంవత్సరాల కంటే పురాతనమైనవి. మధ్యయుగ కాలంలోని కాకతీయ రాజవంశం కాలంలో ఈ ప్రాంతం వైభవాన్ని చూసింది. నిజాం నవాబు పాలనలోనూ పెంబర్తి కళాకారులు పోకచెక్కల పెట్టెలు, సుగంధ ద్రవ్యాల పాత్రలు, లోహపు షాండిలియర్లు, ఝుమ్మర్‌లు, పూల కుండీలు, ప్రత్యేక ఫలకాలు, జ్ఞాపికలు.. వంటి ప్రత్యేక వస్తువులను తయారుచేశారు.
పెంబర్తి శిల్పుల ప్రత్యేక శైలి
హిందూ దేవాలయాల్లోని విగ్రహాలను, రథాలను అలంకరించడానికి ఉపయోగించిన రేకు లోహపు పనితనం బాగా ప్రాచుర్యం పొందింది. కాకతీయ రాజ్యంలో దేవాలయాలకు లభించిన గొప్ప ఆదరణతో పెంబర్తి రేకు లోహపు పనితనం దేశవ్యాప్తంగా ఆకర్షించింది. తెలంగాణ ప్రాంతంలోని చాలా పురాతన దేవాలయాలను కాకతీయ పాలకులు నిర్మించారు. ఈ దేవాలయాల్లో పెంబర్తి శిల్పుల ప్రత్యేక శైలి ఉంది.
ఎలా తయారు చేస్తారంటే...
పెంబర్తి ఇత్తడి కళాకారులు హైదరాబాద్ వ్యాపారుల నుంచి ఇత్తడి రేకులను ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు. ఫ్యాషన్, టెంపుల్, ఇంటీరియర్ డిజైనర్లు అందించిన కళాకృతుల డ్రాయింగ్ పేపర్లను ఇత్తడి రేకులకు అతికిస్తారు. ఇత్తడి రేకుకు మరో వైపు లక్కను కరిగించి పోస్తారు. ఆ ఇత్తడి రేకులను చెక్కపై ఉంచి డ్రాయింగ్ పేపరులోని డిజైన్‌కు అనుగుణంగా చెక్కుతారు. ‘‘ఇత్తడి, రాగి, వెండి, పంచలోహాలను రేకులుగా మలిచి వాటిపై లక్కతో డిజైన్లను చెక్కుతామ’’ని కళా ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అందుకున్న కళాకారుడు మహేశ్వరం మదనాచారి చెప్పారు.
ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేక స్థానం
బంగారు మెరుపులను తలపించేలా ఇత్తడితో కళాకారులు తయారు చేసిన నెక్లెస్‌లు, చెవిపోగులు, పెండెంట్లు యువతను ఆకట్టుకుంటున్నాయి. ‘‘ఈజిప్షియన్ శైలి ఫ్యాషన్ జ్యువెలరీకి ప్రత్యేక డిమాండ్ ఉంది. ర్యాంప్‌వాక్‌ల కోసం మోడల్స్ ధరించే ప్రత్యేక ఇత్తడి ఆభరణాలు, అలంకార తొడుగులను కూడా తయారుచేస్తున్నారు. ఇత్తడితో తయారు చేసిన వివిధ రకాల ఆభరణాలు క్యాట్ వాక్ చేసే అమ్మాయిలను విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి” అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్ కె.శిరీష చెప్పారు.
ఇంటీరియర్ డిజైనింగ్ లో..
దేవాలయాలకు మకర తోరణాలు, ధ్వజస్తంభాలు, కిరీటాలు, కవచాలు, దేవతామూర్తుల విగ్రహాలను తాము తయారుచేస్తున్నాం. ఇళ్లలో ఇంటీరియర్ డిజైనింగ్ కోసం వాడుకునేలా ఇత్తడితో రూఫ్ డెకరేటివ్ ప్యానెల్స్, పులులు, కోతులు, జింకల బొమ్మలు, దేవుడి ఫొటోలను ఇత్తడి రేకులపై చెక్కి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, ఢిల్లీ మెట్రో నగరాల్లోని ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థలకు అందిస్తున్నాం. ఇవి సిటీలో ఉన్న ధనవంతులకు బాగా నచ్చుతున్నాయని విరూపాక్ష హస్తకళా సంస్థ కళాకారుడు యాట శ్రీనివాస్ చెప్పారు.
ఎన్నో హస్తకళా సంస్థలు..
పెంబర్తి కేంద్రంగా1958వ సంవత్సరంలో విశ్వకర్మ బ్రాస్, కాపర్ అండ్ సిల్వర్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఏర్పాటైంది. ఈ కళాఖండాలను హైదరాబాద్ నగరంలోని గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్‌కు కూడా సప్లై చేస్తున్నారు. ఈ సొసైటీ స్థానంలో పెంబర్తికి చెందిన ప్రముఖ కళాకారులు పది వర్క్‌షాపులు, షోరూంలు ఏర్పాటు చేసుకుని నాటి పురాతన కళాకృతుల ప్రాభవం కోల్పోకుండా హ్యాండి క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నారు.
పెంబర్తి మెటల్ హ్యాండీ క్రాఫ్ట్, గణేష్ హ్యాండీ క్రాఫ్ట్, విరూపాక్షి హస్తకళా సంస్థలు కళాఖండాలను తయారుచేస్తున్నాయి. గతంలో పెంబర్తిలో 250 మంది ఉన్న కళాకారుల సంఖ్య నేడు150 మందికి తగ్గింది. అత్యంత పురాతన పెంబర్తి ఇత్తడి కళ అంతరించి పోకుండా ఉండాలంటే ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ హస్తకళలో శిక్షణ ఇవ్వాలని పెంబర్తికి చెందిన హస్తకళాకారుడు బుడిగే శ్రీనివాస్ సూచించారు.
విదేశాల్లోనూ కళకళలాడుతూ..
‘‘ఫ్యాషన్ డిజైనింగ్ రంగానికి అనుగుణంగా పెంబర్తి కళాకారులు ఇత్తడితో కొత్త ప్రయోగాలు చేశాం. ఉంగరాలు, లాకెట్లు, బ్రేస్‌లెట్లు, వాల్ డెకర్స్.. వంటి ఇత్తడితో తయారయ్యే ఈ రకరకాల ఉత్పత్తులకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంద’’ని పెంబర్తి మెటల్ హ్యాండీ క్రాఫ్ట్స్‌కు చెందిన మెటల్ కళాకారుడు మహేశ్వరం సంతోషాచారి చెప్పారు.
అంతర్జాతీయ ప్రదర్శనలు, ఆన్‌లైన్ వేదికలు, ఎగుమతిదారుల సహకారంతో పెంబర్తి కళాకారులు తమ కళను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ఒకప్పుడు గ్రామానికే పరిమితమైన ఈ కళ నేడు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఈ ఇత్తడి కళాకృతుల కోసం పెంబర్తి గ్రామంలోని స్థానిక కళాకారుల నేరుగా సందర్శించి లేదా డిజైన్లను బట్టి ఆర్డర్లు కూడా ఇవ్వొచ్చు. ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు.
పెంబర్తి.. హస్తకళా గ్రామం!
హైదరాబాద్‌కి 80 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే పై ఉంది పెంబర్తి గ్రామం. ఆ ఊరిలో అడుగుపెడితే చాలు.. హస్తకళాకారుల టక్.. టక్ అనే శబ్దాలతో మార్మోగుతుంది. పొద్దునపూట సూర్యకిరణాలు ఇత్తడి రేకులపై పడగానే అవి బంగారు వర్ణంతో మెరిసిపోతుంటే ఆ ఊరు ఓ కళాగ్రామాన్ని తలపిస్తుంటుంది. సుత్తి తాకిడికి ఇత్తడి రేకులు సంగీతం పలుకుతుంటే.. కళాకారుల వేళ్ల స్పర్శకు వాటిపై అద్భుత రూపాలు ఆవిష్కృతమవుతున్నాయి.
ఇళ్ల ముందు, వర్క్‌షాపుల్లో కూర్చుని కళాకారులు ఇత్తడి పలకలపై చెక్కుతుంటే వాళ్ల చేతుల్లోని లోహం అపురూప శిల్పంగా మారిపోతుంది. తెలంగాణ పురాతన ఇత్తడి లోహ కళలకు నిలయమైన ఆ గ్రామంలో ఎటు చూసినా ఇత్తడి కళాఖండాల తయారీలో నిమగ్నమైన కళాకారులతో హస్తకళల సజీవ మ్యూజియంలా దర్శనమిస్తోంది. ఇక్కడ ప్రతి కళాఖండం వెనుక ఒక కుటుంబ జీవితం, ఒక గ్రామం చరిత్ర, ఒక కళాసంపద దాగి ఉంటుంది.
బెస్ట్ టూరిస్ట్ విలేజ్..
గ్రామంలోని ఇళ్లు, వర్క్‌షాప్‌లలో ఎటుచూసినా ఇత్తడి రేకులపై సుత్తి, నగిషీ టూల్స్, ఉలితో వివిధ రకాల కళాకృతులకు ప్రాణం పోస్తున్న కళాకారులే కనిపిస్తారు. గత కొన్ని తరాలుగా వారసత్వంగా వస్తోన్న ఈ కళలో పెంబర్తి కళాకారులు ఇత్తడి రేకులపై గీసిన ప్రతి గీతలో నైపుణ్యం, ప్రతి చెక్కులో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తోంది.
గతంలో పెంబర్తి ఇత్తడి కళను అంతరించిపోకుండా కాపాడటానికి పెంబర్తి లోహ హస్తకళకు 2010వ సంవత్సరంలోనే ప్రతిష్టాత్మక భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) దక్కింది. అలాగే కేంద్ర పర్యాటకశాఖ పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కూడా గుర్తించింది. ఈ గ్రామంలో పది హ్యాండీక్రాఫ్ట్ షోరూంలు, వర్క్‌షాప్‌లు ఉన్నాయి.
