- ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఒక్క ఎకరాకూ నీళ్లియ్యలే
- అవినీతి పైసలు ఏ గుంటనక్క ఇంటికి పోయినయ్
- రూ.368 కోట్లతో స్టార్ట్ చేసి 2,100 కోట్లకు పెంచిన్రు
- దీనికి మాజీ మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలె
- కేటీఆర్ ఆదిలాబాద్‌లో పెట్టేది గర్జన కాదు.. తర్జన భర్జన
- ఇంద్రవెల్లి సభలో టీఆర్ఎస్ చీఫ్ కవిత
ఆదిలాబాద్, వెలుగు: చనాక కొరటా ప్రాజెక్టులో రూ.1,700 కోట్ల అవినీతి జరిగిందని, ఆ పైసలు ఏ గుంటనక్క ఇంటికి పోయినయో మాజీ మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో రూ.368 కోట్లతో చనాక కొరటా ప్రాజెక్టును మొదలుపెట్టి, పదేండ్లలో బడ్జెట్‌ను రూ.2,100 కోట్లకు పెంచిందని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
ఇంద్రవెల్లిలో జరిగిన టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. ‘ఇంత బడ్జెట్ ఎందుకు పెరిగింది? రూ.1,700 కోట్లు ఎవరింటికి పోయినయ్? అప్పటి మంత్రులు ఐకే రెడ్డి, జోగు రామన్న ఇంటికి పోయినయా? అప్పటి ఇరిగేషన్ మంత్రి గుంటనక్క ఇంటికి పోయినయా? లేదంటే బీఆర్ఎస్ ఖాతాలోకి పోయినయా? కేటీఆర్ చెప్పాలె’ అని అన్నారు. చనాక కొరటా ప్రాజెక్టు కింద ఇప్పటికీ ఒక్క ఎకరాకూ నీళ్లు రావడం లేదని, ప్రాజెక్టు కింద వెయ్యి ఎకరాలను ఐకే రెడ్డి బంధువులు కొన్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ పార్క్ పెడతామని తిరుగుతున్నారని, వేరే దగ్గర స్థలం లేనట్లు ప్రాజెక్టు కిందనే ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. సభకు ముందు ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద కవిత నివాళులు అర్పించారు.
గర్జన కాదు.. తర్జన భర్జన
‘రేపు ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ గర్జన పెడుతదట. వాళ్లది గర్జన కాదు.. తర్జన భర్జన. సిద్దిపేట ఆయన మొన్న మీటింగ్ పెట్టుకుని సిరిసిల్ల బాబును పిలవలేదట. అందుకే సిరిసిల్ల ఆయన ఆదిలాబాద్‌లో మీటింగ్ పెట్టుకుని సిద్దిపేట బాబును పిలవడం లేదట. ఇద్దరు బాబుల పంచాయతీలో బీఆర్ఎస్ కార్యకర్తలు తర్జన భర్జన పడుతున్నరు తప్ప ఇది గర్జన కాదు, ఏం కాదు’ అని కవిత ఎద్దేవా చేశారు. రైతులకు ఒక్క ఎకరాకు కూడా నీళ్లియ్యని కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఆదిలాబాద్‌కు వచ్చి రైతు గర్జన పెడతారని ప్రశ్నించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదులు అద్భుతంగా పారుతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టలేదని కవిత విమర్శించారు. గోదావరి నుంచి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టులు కట్టి ఉంటే జిల్లాలో 7.50 లక్షల ఎకరాలకు నీళ్లు పారేవని, ప్రాణహిత ప్రాజెక్టు కట్టి ఉంటే రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని చెప్పారు. జిల్లాలో మైనర్, మీడియం ఇరిగేషన్‌ను నాశనం చేశారన్నారు. ‘కేసీఆర్ స్వయంగా ఆదిలాబాద్‌కు వచ్చి ఆంధ్రోళ్ల పాలనలో అన్యాయం జరిగింది, ఇక్కడ యూనివర్సిటీ కడతామన్నారు. ఇప్పటిదాకా ఒక్క యూనివర్సిటీ అయినా ఇచ్చారా? అని కేటీఆర్‌ను సూటిగా అడుగుతున్నా’ అని కవిత అన్నారు.
కాగజ్‌నగర్‌లో మూతబడ్డ మిల్లును తెరిపిస్తామని చెప్పి పెట్టుబడిదారులకు వెయ్యి కోట్లు ఇచ్చారని, మంచి చేసి ఉంటే కార్మికులు ఇప్పటికీ ఎందుకు ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు. ఆనాడు సీసీఐని కాపాడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, దీనికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కారణమన్నారు. జిల్లాలో 80 లక్షల క్వింటాళ్ల పత్తి పండుతుందని, పదేండ్లు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి హిందీ, ఇంగ్లీష్ మాట్లాడి దేశవిదేశాలు తిరిగిన కేటీఆర్ ఇక్కడ టెక్స్‌టైల్ పార్క్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇంద్రవెల్లి అమరవీరులను గుర్తిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి కేవలం రూ.5 లక్షలు ఇచ్చి అవమానించారని, అమరవీరుల సాక్షిగా అధికారంలోకి వచ్చి వారిని మోసం చేశారని ఆరోపించారు.
తాము అధికారంలోకి వస్తే ప్రైవేట్ స్కూళ్లలోనూ ఉచిత విద్య, ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. ఏదైనా రోగం వస్తే ఒక ప్రైవేట్ ఉద్యోగి మూడు, నాలుగు నెలల జీతం ఒక్కసారే ఖర్చవుతోందని, ఆ పరిస్థితి రానివ్వబోమన్నారు. యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు ఇస్తామని చెప్పారు. ‘మంచిర్యాల ఎమ్మెల్యే కంప్లీట్ రౌడీ. ఎంత రౌడీ అంటే మంత్రిని కూడా తన దగ్గరికి రానివ్వడు. మంత్రి వివేక్ అన్న ఇప్పటిదాకా మంచిర్యాలలో మీటింగ్ కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. ఈ మాట బాధతో చెబుతున్నా’ అని కవిత అన్నారు.
