- కీసరలో 11.18, నార్కెట్‌పల్లిలో 9 సెం.మీ.
- ఐటీ కారిడార్‌లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్
- మాదాపూర్ నాలాలో కొట్టుకుపోయిన డెలివరీ బాయ్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, వెలుగు: అతి తీవ్ర తుపాన్ అర్నబ్ ప్రభావంతో రాష్ట్రంలోని నాలుగైదు జిల్లాల్లో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో 11.2 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డు కాగా.. -కీసరలో అత్యధింగా 11.18 సెంటి మీటర్లు నమోదైంది. రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ వర్షం పడింది. సంగారెడ్డిలో తేలికపాటి వాన కురిసింది. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలో 9 సెంటీమీటర్లు, యాదాద్రిభువనగిరి జిల్లా వర్కటపల్లిలో 8.9, వెంకిర్యాల్‌లో 8.4, ఎల్లంకిలో 7.5, నల్గొండ జిల్లా చిట్యాలలో 7.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ఇటు హైదరాబాద్ సిటీ పరిధిలోనూ భారీ వర్షాలు పడ్డాయి. బహదూర్‌పురాలో 8.2 సెంటీమీటర్లు, కాకతీయహిల్స్‌లో 7.4, తొర్రూరులో 7.1, ఎంసీహెచ్‌ఆర్డీలో 6.7, షేక్‌పేటలో 6.7, రూప్‌లాల్ బజార్‌లో 6.5, సదర్మహల్లో 6.4, ఘాన్సీబజార్‌లో 6.3, వివేకానందనగర్‌లో 6.3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. బంగాళాఖాతంలోని అండమాన్ వద్ద అల్పపీడనం ఏర్పడిందని, రాష్ట్రంలో 4 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం
అర్నబ్ తుపాన్ ప్రభావంతో క్యూర్ పరిధిలో, కీసరలో వాన దంచికొట్టింది. ఇటు బంజారాహిల్స్‌తోపాటు హైటెక్ సిటీ, మాదాపూర్, నానక్ రాంగూడ తదితర ప్రాంతాల్లో భారీ వాన పడింది. వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే సమయంలో కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. ఐటీ కారిడార్ లో ఎక్కడికక్కడ వెహికల్స్ నిలిచిపోయాయి. ఐకియాతోపాటు మరికొన్నిచోట్ల గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. మెట్టుగూడ, తార్నాక, సంగీత్ జంక్షన్ ప్రధాన మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో వాహనదారులు, పాదచారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సంగీత్ కూడలి, తార్నాక ఫ్లైఓవర్ సమీపంలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ డివిజన్ శివసాయినగర్‌లో ఇళ్ల మధ్యలో ఉన్న తాటిచెట్టుపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో చెట్టు కాలిపోయింది. జూబ్లీహిల్స్ , బంజారా హిల్స్, వెంకటగిరి, యూసఫ్‌గూడ, బోరబండ ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద చేరడంతో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. యూసఫ్‌గూడ ప్రధాన రహదారిపై వర్షపు నీరు వేగంగా ప్రవహించడంతో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కిందపడిపోయారు. కాగా, నాలుగు నెలలుగా ఎండవేడిమి, ఉక్కపోతతో విలవిలలాడుతున్న నగరవాసులకు ఈ వర్షంతో కాస్తా ఊరట లభించింది.
నాలాలో కొట్టుకుపోయిన జెప్టో డెలివరీ బాయ్
మాదాపూర్‌లోని విఠల్‌రావు నగర్ వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటిలో జెప్టో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఘంటసాల అర్జున్ కుమార్ (46) తన బైక్‌పై వెళ్తుండగా పడిపోయాడు. అక్కడి నాలాలో 100 మీటర్ల దూరం కొట్టుకుపోయి ఓ రాడ్‌ను పట్టుకొని వేలాడాడు. సమాచారం అందుకున్న పోలీసులు, హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అర్జున్ కుమార్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారు. అనంతరం ఈ ప్రాంతాన్ని కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. మాదాపూర్ పరిసరాల్లో వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించి.. రోడ్లపై చేరిన నీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు.
