సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. ఒక్కొక్కరికి రూ.1.10 లక్షలు

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. ఒక్కొక్కరికి రూ.1.10 లక్షలు
  • రూ.419 కోట్లు ఇవ్వనున్న సర్కార్
  • నవంబర్ 5న కార్మికుల ఖాతాల్లో జమ
  • 38 వేల మంది కార్మికులకు ప్రయోజనం
  • వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. బోనస్ రూపంలో రూ.419 కోట్లు చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 చొప్పున అందనున్న ఈ మొత్తాన్ని నవంబర్ 5న వారి ఖాతాల్లో జమ చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌‌లో మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న సింగరేణి అభివృద్ధి, విస్తరణకు ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటికే లాభాల్లో వాటా కింద ఈ నెలలో కార్మికులకు దాదాపు రూ.600 కోట్లు చెల్లించామని, తాజాగా మరో రూ.419 కోట్ల బోనస్ అందించనున్నామని తెలిపారు. బొగ్గు రంగంలో పోటీని తట్టుకునేందుకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ఫైనాన్స్ అధికారులను అప్రమత్తం చేశారు. నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఖాతాల్లో బోనస్ సొమ్ము జమ చేయాలని ఆదేశించారు.

కనీసం 30 రోజులు పనిచేసి ఉండాలి

సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు సగటున ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున దీపావళి బోనస్ అందనుంది. ఈ ప్రయోజనం ఎన్‌‌సీడబ్ల్యూఏ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అధికారులకు వర్తించదు. గత ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల్లో 190 పని దినాలు, ఓపెన్‌‌కాస్ట్, సర్ఫేస్ విభాగాల్లో 240 పని దినాలు పూర్తి చేసినవారికి పూర్తి బోనస్ అందుతుంది. అంతకంటే తక్కువ రోజులు పనిచేసినవారికి హాజరు ఆధారంగా నిష్పత్తి ప్రకారం చెల్లిస్తారు. బోనస్‌‌కు అర్హత పొందాలంటే గత ఆర్థిక సంవత్సరంలో కనీసం 30 రోజులు పనిచేసి ఉండాలి. ఈ విధంగా సుమారు 38 వేల మంది కార్మికులకు 
ప్రయోజనం చేకూరనుంది.

నెల రోజుల్లో చెల్లింపుసింగరేణి కార్మికులకు నెల రోజుల 


వ్యవధిలో దసరా, దీపావళి బోనస్‌‌ల రూపంలో మొత్తం రూ.1,020 కోట్లు చెల్లించనున్నారు. ఇప్పటికే దసరా బోనస్ కింద సుమారు రూ.600 కోట్లు కార్మికుల ఖాతాల్లో జమ చేశారు. తాజాగా మరో రూ.419 కోట్లు ఐదు రోజుల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది ఒక్కో సింగరేణి కార్మికుడికి బోనస్ రూపంలోనే రూ.2.65 లక్షలు అందుతున్నాయని సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి తెలిపారు. బోనస్ సొమ్మును కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని, వీలైతే కొంత పొదుపు చేసుకోవాలని ఆయన సూచించారు. పండుగల స్ఫూర్తితో ఉత్సాహంగా పనిచేస్తూ గనులు, శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.