బనకచర్ల ప్రాజెక్ట్..కేసీఆర్ బ్రెయిన్ చైల్డే..ఏపీకి నీళ్లు తరలించాలని బాబుకు సలహా ఇచ్చిందే ఆయనే

బనకచర్ల ప్రాజెక్ట్..కేసీఆర్ బ్రెయిన్ చైల్డే..ఏపీకి నీళ్లు తరలించాలని బాబుకు సలహా ఇచ్చిందే ఆయనే
  • మీడియాకు కేసీఆర్ మాట్లాడిన వీడియోలు చూపించిన సీఎం
  • వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రికార్డులతో అన్నీ బయటపెడ్తా 
  • కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల ఆస్తి.. మరమ్మతులు చేయిస్తం
  • మెట్రో, బుల్లెట్ ట్రైన్‌‌‌‌ను కేటీఆర్ అడ్డుకుంటుండ్రని ఆరోపణ
  • డిసెంబర్ 9లోగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిస్తామని వెల్లడి
  • గోదావరి–కావేరి అనుసంధానంపై  రెండు ప్రతిపాదనలు 
  • ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్​

 

 న్యూఢిల్లీ, వెలుగు: సముద్రంలో కలిసే వరద జలాల పేరుతో గోదావరి నీటిని కృష్ణాకు అక్రమంగా తరలించేందుకు ఏపీ తలపెట్టిన ‘పోలవరం–బనకచర్ల’ లింక్ ప్రాజెక్ట్ (పీబీఎల్పీ) కేసీఆర్ బ్రెయిన్ చైల్డేనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబుకు తానే సలహా ఇచ్చినట్లు కేసీఆర్ గతంలో అసెంబ్లీలో చెప్పిన వీడియోను ఆయన మీడియాకు చూపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం శుక్రవారం మీడియాతో చిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చాట్ చేశారు. ‘దుమ్ముగూడెం–భద్రాచలం తర్వాత వేలాది టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి, వాటిని వాడుకుని ప్రాజెక్టులు కట్టుకోండని ఏపీకి సూచించానని కేసీఆర్ స్వయంగా చెప్పారు.

మెడ మీద తలకాయ ఉన్న ఏ నాయకుడైనా సొంత రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి పొరుగు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతారా? ఈ విషయాలన్నీ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆధారాలతో సహా పెడతా’ అని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరం నుంచి కిందికి పారే నీటిని తుపాకులగూడెం, దేవాదుల, సమ్మక్క–సారక్క రిజర్వాయర్, సీతారామ ప్రాజెక్టు, చివరగా భద్రాద్రి జిల్లాలోని ప్రాజెక్టులు ఒడిసిపడతాయని, ఆ తర్వాతే నీళ్లు ఏపీకి వెళ్తాయని రేవంత్ చెప్పారు. కానీ కాళేశ్వరాన్ని రిపేర్ చేయకుండా ఏపీకి నీళ్లు పారిస్తున్నారని హరీశ్ రావు, కేటీఆర్ మెదడు లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.  

ఎన్డీఎస్ఏ సూచనల మేరకే కాళేశ్వరం రిపేర్లు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని రేవంత్  స్పష్టం చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు వంద శాతం రిపేర్లు చేస్తామని చెప్పారు. అది తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టని, కేసీఆర్ ఆస్తి కాదన్నారు. ‘ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చాక పనులు మొదలుపెడతాం. కాళేశ్వరం రిపేర్లు పూర్తి చేసి తీరుతాం. నల్గొండ, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలంటే కాళేశ్వరాన్ని బాగు చేయాల్సిందే. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అని చెప్పారు. ‘మేడిగడ్డ సహా మూడు బ్యారేజీలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వాటిలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదు. ఇవి ఇంకా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులే కాబట్టి పునరుద్ధరణ బాధ్యత రాష్ట్రానిదేనని తెలిపారు.

మూడేండ్లలో ఎత్తిపోసింది 20 టీఎంసీలే

కాళేశ్వరం ప్రారంభించాక మూడేండ్లలో కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి 100 టీఎంసీలు ఎత్తిపోస్తే, వరదలతో ఎస్సారెస్పీ నుంచి 80 టీఎంసీలు మళ్లీ కిందికి వదిలారని సీఎం చెప్పారు. అంటే మూడేండ్లలో బీఆర్ఎస్ ఎత్తిపోసింది 20 టీఎంసీలేనన్నారు. మేడిగడ్డలో కనీస నిల్వ ఉంటేనే నీళ్లు ఎత్తిపోయడం సాధ్యమని, ప్రవాహం నుంచి ఎలా ఎత్తిపోస్తారని ప్రశ్నించారు. ఒకవేళ మేడిగడ్డ నుంచి ఎత్తిపోసినా అన్నారం, సుందిళ్లలో నిల్వ చేసే పరిస్థితి లేదని, నీళ్లు మళ్లీ వెనక్కే వెళ్తాయన్నారు. మూడు బ్యారేజీల్లో ఒకేసారి పంపింగ్ జరిగితేనే నీళ్లు పైకి వస్తాయన్నారు. గోదావరికి ఏటా సుమారు 3 వేల టీఎంసీల ప్రవాహం ఉంటుందని, వరదలు వచ్చే పది రోజుల్లోనే 2 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని చెప్పారు. ఆ పది రోజులు రోజుకు 2 టీఎంసీల చొప్పున పంపులు నడిపినా కాళేశ్వరం ఎత్తిపోసేది 20 టీఎంసీలేనన్నారు. తలాతోకా లేకుండా బీఆర్ఎస్ చేసిన తప్పులను తమ ప్రభుత్వానికి అంటగట్టేలా కేసీఆర్, హరీశ్  మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

గోదావరి–కావేరిపై రెండు ప్రతిపాదనలు

కేంద్రం ప్రతిపాదిస్తున్న గోదావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్ర వైఖరిని స్పష్టంగా చెప్పామని సీఎం తెలిపారు. ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్ నుంచి మళ్లించే 148 టీఎంసీల్లో తుపాకులగూడెం నుంచి తెలంగాణకు 43 టీఎంసీలు ఇవ్వాలని, అందుకయ్యే నిధులు కేంద్రమే భరించాలనేది మొదటి డిమాండ్ అని, లేదంటే తుపాకులగూడెం దగ్గరే అనుసంధానం చేయాలనేది రెండో ప్రతిపాదన అని చెప్పారు. రాష్ట్రంలో సాగు అంచనాల మేరకు గోదావరిలో 1,000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలకు ఏపీ ఎన్ఓసీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, ఆ తర్వాతే మిగులు జలాలపై చర్చిస్తామన్నారు.   రెవెన్యూ లెక్కల ప్రకారం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక ఎకరం 34 గుంటల భూమి మాత్రమే ఉండేదని రేవంత్ అన్నారు. తన కుటుంబంలో మూడు తరాలు పోలీస్ పటేళ్లని, తాను శ్రీమంతుడినని చెప్పారు.  

మెట్రో, బుల్లెట్ ట్రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపుతున్నది కేటీఆరే

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి మెట్రో రైల్ సెకండ్ ఫేజ్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులను కేటీఆర్ అడ్డుకుంటున్నారని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మెట్రో విస్తరణ కోసం ఒక్కసారి కూడా కేంద్ర మంత్రిని కలవని కేటీఆర్, ఇప్పుడు కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించడమేంటని ప్రశ్నించారు. బుల్లెట్ ట్రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూసేకరణ చేస్తున్నామని, కేంద్రం చెప్పినట్లే మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి టేకోవర్ చేసుకున్నామని చెప్పారు.  ‘మెట్రో ఫేజ్–1 కింద 70 కిలోమీటర్లు నిర్మించారు. కిలోమీటరుకు సగటున రూ.350 కోట్లు లెక్కేసినా ప్రాజెక్టు ఆస్తి విలువ సుమారు రూ.24,500 కోట్లు. ఎల్ అండ్ టీకి బ్యాంకుల్లో రూ.13,500 కోట్ల అప్పుంది. దానిపై 8.5 నుంచి 9 శాతం వడ్డీ కడుతుండడంతో ఏటా రూ.600 కోట్ల నష్టం వస్తోంది’ అని వివరించారు. ఐఆర్ఎఫ్సీ నిధులు వస్తే వడ్డీ 9 నుంచి 3 శాతానికి తగ్గి ఆ నష్టం తప్పుతుందని, ఇలా ఫేజ్–1 భారం తగ్గించుకుని రెండో దశను ముందుకు తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ ప్లాన్ అని చెప్పారు.

ఖైరతాబాద్ బైపోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దానం నాగేందరే

ఏ ఎన్నికనైనా తాను సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే తీసుకుంటానని, అందుకు తగ్గ వ్యూహాలతో ముందుకెళ్తామని సీఎం చెప్పారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇంకా పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టలేదన్నారు. ఖైరతాబాద్ బైపోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దానం నాగేందరే తమ అభ్యర్థిగా బరిలో ఉంటారని తెలిపారు.  

ఆ నలుగురు సీఎంల కన్నా మంచి పథకాలు

ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో పేరున్న ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సాఆర్, కేసీఆర్ ల కన్నా మంచి పథకాలను తాము అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వీరు ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్ని తొలగించలేదని,  స్కాం కారణంగా కేసీఆర్ కిట్లను పక్కన పెట్టినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ఫ్రీ కరెంటు ఇస్తుందని, 75 వేల పోస్టులు భర్తీ చేశామని సీఎం వివరించారు.  

‘కేసీఆర్ తీరుతో తెలంగాణపై నమ్మకం పోయింది’

తుమ్మిడిహట్టి బ్యారేజీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తప్పుబట్టారని రేవంత్ చెప్పారు. ‘కేసీఆర్ వచ్చి 148 మీటర్ల ఎత్తు చాలని ఒప్పుకున్నారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తామే పరిహారం ఇస్తామన్నారు. తర్వాత ఇవ్వకపోవడంతో ఆ పరిహారాన్ని రైతులకు మేమే చెల్లించాం.

కేసీఆర్ తీరుతో తెలంగాణపై మాకు నమ్మకం పోయింది’ అని ఫడ్నవీస్ తనతో చెప్పారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన భూసర్వే వివరాలు తప్పులతడకగా ఉన్నందున 152 మీటర్ల ఎత్తులో ముంపు, నీటి లభ్యత, పరిహారంపై తామే సొంతంగా సర్వే చేసి నివేదికలు తయారు చేస్తామని, ఎనిమిది వారాల తర్వాత మళ్లీ సమావేశమై నిర్ణయం తీసుకుందామని ఫడ్నవీస్ చెప్పినట్లు వివరించారు. ఒప్పందాల అమలు, పరిహారం విషయంలో తెలంగాణ ట్రాక్ రికార్డు బాగాలేదని ఆయన అన్నారని తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం రిప్లై కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

పదేండ్లలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే?

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని సీఎం విమర్శించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు–రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, దీంతో 3 టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేసుకునే వెసులుబాటు లేకుండా పోయిందన్నారు.  కొడంగల్ ఎత్తిపోతలను రద్దు చేశారని ఆరోపించారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఒప్పుకుని రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని, రోజుకు 11 టీఎంసీలు తరలించుకునేలా ఏపీ ప్రాజెక్టులకు అనుమతులిచ్చారని ఫైర్ అయ్యారు. భూసేకరణకు డబ్బులివ్వకుండా కమీషన్లు వచ్చే పనులే చేశారన్నారు.

కేసీఆర్ ఏనాడూ తెలంగాణ ప్రయోజనాలు కోరలే

దాదాపు 30 ఏండ్లుగా ఏదో రకంగా అధికారంలో ఉన్నా కేసీఆర్ ఏనాడూ తెలంగాణ ప్రయోజనాల కోసం పట్టుబట్టలేదని రేవంత్ ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఏదో విధంగా పొత్తులో ఉన్నారని గుర్తుచేశారు. నాయిని నర్సింహారెడ్డి కడప ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జిగా ఉన్నప్పుడే ఏపీకి నీళ్లు తరలించారని ఆరోపించారు. ఇవన్నీ బయటకు వస్తే ఇరుకున పడతామని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెలుసన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో, తమ మూడేండ్ల పాలనలో జరిగిన ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, టెండర్లపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. తమ సర్కార్ భూసేకరణ పూర్తయ్యాకే టెండర్లు పిలుస్తుందని, కేసీఆర్ హయాంలో భూసేకరణ లేకుండానే భారీగా టెండర్లు పిలిచారని విమర్శించారు.

డిసెంబర్ 9లోగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు

డిసెంబర్ 9లోగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలపకుండా జర్నలిస్టులకు వేరుగా స్థలాలు ఇస్తామన్నారు. అక్కడి నుంచే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి భూమిని గుర్తించి లే అవుట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొంగరకలాన్, ఫ్యూచర్ సిటీలో ఎక్కడ స్థలాలు ఇవ్వాలనే దానిపై జర్నలిస్టులతో చర్చించాలని సూచించారు.