- రేట్ల పెంపుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
- రాష్ట్రంలో బియ్యం కొరత లేనే లేదు
- ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు
- రేట్లు తగ్గే దాకా తనిఖీలు చేయాలంటూ పౌరసరఫరాల అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రజలు ఎక్కువగా వినియోగించే బీపీటీ బియ్యం ధర ఎట్టిపరిస్థితుల్లోనూ కిలో రూ.66కు మించరాదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బియ్యం రేట్లను వ్యాపారులు అడ్డగోలుగా పెంచడంపై సీరియస్అయ్యారు. సామాన్యులకు భారంగా మారిన బియ్యం రేట్లను వెంటనే తగ్గించాలని, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్న వ్యాపారులు, మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. రేట్లు దిగివచ్చేదాకా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు.
శుక్రవారం హైదరాబాద్ బేగంపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సివిల్ సప్లయ్స్శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బియ్యం ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, వ్యాపారులు, మిల్లర్లతో అధికారులు జరిపిన చర్చల పురోగతిని సివిల్ సప్లయ్స్శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను అడిగి తెలుసుకున్నారు. అక్రమ నిల్వలు, అధిక రేట్లను అరికట్టేందుకు చేపట్టిన తనిఖీలు ఎలా జరుగుతున్నాయో ఆరా తీశారు.
తనిఖీలు కొనసాగిస్తం
బియ్యం క్వాలిటీ, రేట్లలో అక్రమాలను అరికట్టేందుకు 5 శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ చెప్పారు. సివిల్ సప్లయ్స్, పోలీస్, జీఎస్టీ, తూనికలు–కొలతల శాఖలతోపాటు సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు ఈ దాడుల్లో పాల్గొంటున్నాయని స్పష్టంచేశారు. ఇప్పటికే అక్రమ నిల్వలు, అధిక రేట్లకు విక్రయాలకు సంబంధించి వ్యాపారులపై 12 కేసులు నమోదు చేసినట్టు మంత్రి తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని హోల్‌సేల్, రిటైల్బియ్యం మార్కెట్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు. బేగంబజార్, నాంపల్లి, మహరాజ్‌గంజ్‌లాంటి ప్రధాన వ్యాపార కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్టు వెల్లడించారు. మార్కెట్‌లో ధరలు దిగివచ్చే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బియ్యం కొరత లేదు
రాష్ట్రంలో ప్రజల అవసరాలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ భరోసా ఇచ్చారు. కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో అవసరానికి మించి బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఇక్కడి మిల్లుల్లోనే బియ్యంగా మార్చి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్నామని వివరించారు. నిబంధనలకు తగ్గట్టుగా వ్యాపారం చేసే మిల్లర్లు, వ్యాపారులతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుందని, అక్రమ పద్ధతులతో వినియోగదారులపై భారం మోపే వారిని మాత్రం ఉపేక్షించబోమని ఉత్తమ్ హెచ్చరించారు.
