Shane Nigam: విషాదాల మధ్య విజేతగా ఎదిగిన షేన్ నిగమ్.. ఓటీటీ ‘దృఢం’ మూవీ హీరో సక్సెస్ స్టోరీ

Shane Nigam: విషాదాల మధ్య విజేతగా ఎదిగిన షేన్ నిగమ్.. ఓటీటీ ‘దృఢం’ మూవీ హీరో సక్సెస్ స్టోరీ

ఒకప్పుడు మలయాళ సినిమాల్లో కొత్త ముఖంగా కనిపించిన కుర్రాడు.. ఈరోజు అక్కడి ప్రేక్షకులు అతన్ని స్క్రీన్​ మీద చూసేందుకు ఎదురుచూసేలా చేసిన నటుల్లో ఒకడిగా మారాడు. చిన్న పాత్రలతో మొదలైన అతని ప్రయాణం, మధ్యలో ఎన్నో కష్టసమయాలు చవిచూశాడు. అందులో కెరీర్‌నే ప్రశ్నార్థకంగా మార్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలా ఎన్నో ఒడిదొడుకులు చూసినప్పటికీ వెనక్కి తగ్గలేదు ఈ నటుడు.. అతనే షేన్ నిగమ్ (Shane Nigam).

తనకున్న టాలెంట్​తోనే అవకాశాలను తిరిగి సంపాదించుకున్నాడు. నేచురల్ యాక్టింగ్​, పాత్రలో పూర్తిగా ఒదిగిపోయే తీరు, కొత్త కథలను ఎంచుకునే ధైర్యం అతడిని మలయాళ చిత్రసీమలో ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న షేన్.. తన సినీ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

ఈ రోజు మలయాళ సినిమా రంగంలో సహజ నటన గురించి మాట్లాడితే గుర్తుకొచ్చే పేర్లలో షేన్ నిగమ్ ఒకరు. అతడు నటిస్తున్నాడనే భావన కంటే, నిజ జీవితంలో ఒక వ్యక్తిని చూస్తున్నామనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. అదే అతడి బలం. అదే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. 

కొచ్చి వీధుల నుంచి వెండితెర వరకు..

1995 డిసెంబర్ 21న కేరళలోని కొచ్చిలో షేన్ నిగమ్ పుట్టా డు. ఎలమక్కర ప్రాంతంలో పెరిగాడు. చిన్నప్పటి నుంచే అతడి చుట్టూ కళారంగానికి సంబంధించిన వాతావరణం ఉండేది. కారణం అతడి తండ్రి కళాభవన్ అబీ. కేరళలో మిమిక్రీ కార్యక్రమాలు అంటే గుర్తొచ్చే ప్రముఖ పేర్లలో అబీ ఒకరు. వేదికలపై నవ్వులు పంచిన ఆయన, సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. అందువల్ల షేన్‌కు చిన్న వయసులోనే కెమెరా, స్టేజ్, సినిమా ప్రపంచం పరిచయమయ్యాయి. అయితే ఇండస్ట్రీలో సక్సెస్​ అంత ఈజీగా రాదని అతడు చాలాత్వరగానే గ్రహించాడు. అందుకే మొదటినుంచే తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలనే ఆలోచనతో ముందుకుసాగాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shane Nigam (@shanenigam786)

చదువుతోపాటే..

షేన్ కొచ్చిలోనే తన స్కూల్​ చదువు పూర్తిచేశాడు. ఆ తర్వాత ఇంజినీరింగ్ చదవడానికి కాలేజీలో చేరాడు. కానీ పుస్తకాలకంటే సినిమాల్లోని పాత్రలు అతడిని ఎక్కువగా ఆకర్షించాయి. తరగతి గదిలో కూర్చుని భవిష్యత్తు గురించి ఆలోచించడం కంటే, కెమెరా ముందు నిలబడి కొత్త ప్రపంచాలను అనుభవించడం అతడికి మరింత ఇంట్రెస్టింగ్​గా అనిపించింది.

అయితే దానికంటే ముందే 2010లో వచ్చిన ‘తంతోన్ని’ సినిమాలో బాలనటుడిగా కనిపించాడు షేన్. ఆ తర్వాత ‘అన్నయుం రసూలుం’, ‘నీలాకాశం పచ్చకడల్ చువన్న భూమి’, ‘కమ్మట్టిపాడం’ వంటి చిత్రాల్లో కనిపించాడు. ప్రతి చిన్న పాత్రను ఒక అవకాశంగా తీసుకున్నాడు. కెమెరా ముందు ఎలా ఉండాలి? భావాలను ఎలా వ్యక్తపరచాలి? ఒక పాత్రను ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాలు నేర్చుకుంటూ ముందుకుసాగాడు. 

ఒక్కో సినిమాతో పెరిగిన గుర్తింపు

‘కిస్మత్’ తర్వాత వచ్చిన ప్రతి సినిమా షేన్‌ను ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లింది. ‘పరవ’లో అతడు చూపించిన నటన యూత్​కి బాగా కనెక్ట్​ అయింది. స్నేహం, కలలు, బాధ, ప్రేమ.. ఇవన్నీ ఒకే పాత్రలో ఎంతో సహజంగా కనిపించాయి. ‘ఈడ’ సినిమాలో ప్రేమికుడిగా నటించి మరోసారి ప్రశంసలు అందుకున్నాడు. ఒకే రకమైన పాత్రల్లో కాకుండా ప్రతి సినిమాలో కొత్త కోణం చూపించేందుకు ప్రయత్నించడం అతడి ప్రత్యేకతగా మారింది.

విజయాల మధ్యలో విషాదం!

తన కెరీర్​లో మంచి రోజులు రాబోతున్న టైంలోనే షేన్ జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. 2017లో అతడి తండ్రి కళాభవన్ అబీ అకస్మాత్తుగా మరణించారు. ఇది షేన్‌ను తీవ్రంగా కుంగదీసింది. తండ్రి కేవలం కుటుంబ పెద్ద మాత్రమే కాదు. అతడికి మార్గం చూపిన వ్యక్తి. తన ప్రయాణాన్ని దగ్గరుండి చూసిన వ్యక్తి. అలాంటి మనిషిని కోల్పోవడం ఏ కొడుకుకైనా తట్టుకోలేని బాధే. ఆ బాధ నుంచి బయటపడటానికి షేన్​కి చాలాకాలం పట్టింది. 

ఆగిపోతుందనుకున్న కెరీర్..

తండ్రి మరణం నుంచి కోలుకుంటున్న టైంలోనే కెరీర్​లో కూడా సమస్యలు మొదలయ్యాయి. కొన్ని సినిమాల విషయంలో నిర్మాతలతో విభేదాలు వచ్చాయి. వాటి కారణంగా అతడి పేరు తరచూ వార్తల్లో కనిపించింది. కొంతమంది విమర్శించారు. మరికొందరు అతడిని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒక దశలో షేన్ కెరీర్ ఇక్కడితో ఆగిపోతుందేమో అన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. మానసిక ఒత్తిడి పెరిగింది. అయినా అతడు వెనక్కి తగ్గలేదు. తన బలం నటనే అని నమ్మాడు.

మళ్లీ నిలబెట్టింది నటనే

కష్టకాలం తర్వాత వచ్చిన ‘భూతకాలం’ షేన్‌కు కొత్త ఊపిరి ఇచ్చింది. ఆ సినిమాలో అతడు చూపించిన నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. భయం, ఒంటరితనం, మనసులో జరిగే సంఘర్షణ.. ఇవన్నీ చాలా సహజంగా చూపించాడు. తర్వాత వచ్చిన ‘ఆర్‌డీఎక్స్’ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఆ సినిమా ద్వారా షేన్ మరోసారి బలంగా నిలబడ్డాడు. ఒకప్పుడు వివాదాల కారణంగా వార్తల్లో నిలిచిన నటుడు, ఇప్పుడు తన నటనతో మళ్లీ ప్రశంసలు అందుకోవడం మొదలుపెట్టాడు. ఈరోజు అతడు సాధించిన స్థానం ఒక్క రోజులో వచ్చినది కాదు. ఎన్నో సంవత్సరాల శ్రమ, ఓర్పు, పోరాటం తర్వాత వచ్చిన రిజల్ట్​. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SAJITH RM (@sajithrm)

‘కుంబళంగి నైట్స్’.. అతి పెద్ద మలుపు

2019లో వచ్చిన ‘కుంబళంగి నైట్స్’ మలయాళ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ సినిమాలో బాబీ పాత్రలో షేన్ నటించాడు. అది సాధారణ కథానాయకుడి పాత్ర కాదు. తన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఒక యువకుడి పాత్ర. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు కథ గురించి ఎంత మాట్లాడారో, షేన్ నటన గురించి కూడా అంతే మాట్లాడారు. అప్పటివరకు మంచి నటుడిగా గుర్తింపు పొందిన షేన్, ఆ సినిమా తర్వాత అందరి దృష్టిలో పడ్డాడు. 

‘కిస్మత్’తో మారిపోయిన లైఫ్​

2016లో విడుదలైన ‘కిస్మత్’ షేన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాలో మెయిన్​ లీడ్​గా చేసిన అతడు ఫస్ట్​ టైం అభిమానుల ప్రేమను రుచిచూశాడు. ప్రేమ, ఆవేశం, ఆత్మవిశ్వాసం.. ఇలా ఒక యువకుడిలో ఉండే భావాలను నేచురల్‌గా చూపించాడు. సినిమా విజయంతోపాటు అతడి నటన గురించి కూడా అప్పట్లో చాలా మాట్లాడుకున్నారు. ‘ఈ కుర్రాడికి టాలెంట్​ ఉంది. యాక్టింగ్​లో మంచి ఫ్యూచర్​ ఉంటుంది’ అనే మాటలు ఇండస్ట్రీలో వినిపించడం అప్పుడే మొదలైంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shane Nigam (@shanenigam786)

ఇప్పుడు చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం షేన్ కొత్త కథలు ఎంచుకోవడంలో కూడా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాడు. లేటెస్ట్​గా రిలీజ్ అయిన ‘దృఢం’ సినిమాలో అతడు పోలీసు అధికారి విజయ్ రాధాకృష్ణన్ అనే పాత్రలో కనిపించాడు. ఒక చిన్న ఊరిలో వరుసగా జరిగే నేరాల వెనుక నిజాన్ని వెలికితీసే అధికారి పాత్రలో షేన్ నటించాడు. త్వరలోనే టాలీవుడ్​లోకి నేరుగా ఎంట్రీ ఇచ్చేందుకు కూడా షేన్ రెడీ అవుతున్నాడు. ఒక యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రంలో రేసర్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్ర కోసం తెలుగు భాష నేర్చుకుంటున్నట్టు వార్తలొచ్చాయి.