అమెరికా అధ్యక్షుడి చావు నుంచి పుట్టిన FBI.. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ దర్యాప్తు సంస్థగా ఎలా ఎదిగింది..?

అమెరికా అధ్యక్షుడి చావు నుంచి పుట్టిన FBI.. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ దర్యాప్తు సంస్థగా ఎలా ఎదిగింది..?

అమెరికా దర్యాప్తు సంస్థ.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) వినే ఉంటారు. ఈ దర్యాప్తు సంస్థ ఏర్పాటు వెనుక పెద్ద కథే ఉంది. అమెరికాలో ఈ దర్యాప్తు సంస్థ ఒక విషాదం నుంచి పుట్టింది. 1901లో ఉగ్రవాదులు అప్పటి అమెరికా అధ్యక్షుడు విలియం మెకిన్లీని కాల్చి చంపారు. అమెరికా భద్రతా వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఎంత పేలవంగా ఉందో ఈ ఘటన రుజువు చేసింది. ఈ ఘటన తరువాత, కొత్త అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ ఒక పటిష్టమైన దర్యాప్తు సంస్థ అవసరాన్ని గుర్తించారు. ఆ సమయంలో.. అమెరికా న్యాయ శాఖకు సొంత దర్యాప్తు అధికారులు కూడా లేరు.

ఏదైనా కీలక కేసును దర్యాప్తు చేయడానికి.. ట్రెజరీ డిపార్ట్‌మెంట్ సీక్రెట్ సర్వీస్ నుంచి ఏజెంట్లను తీసుకోవలసి వచ్చేది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సొంత స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే.. ఈ విషయంలో అప్పటి అమెరికా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా కాంగ్రెస్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.

మన దేశంలో మోదీ ప్రభుత్వం.. సీబీఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలను విపక్షాలను టార్గెట్ చేసేందుకు వాడుకుంటుందని తీవ్ర ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో అమెరికాలోని కాంగ్రెస్ కూడా ఈ తరహాలోనే  భయపడింది. అమెరికా ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తు సంస్థ పేరుతో శక్తివంతమైన పోలీసు దళాన్ని తన రాజకీయ ప్రత్యర్థులపైనా, తోటి ఎంపీలపైనా గూఢచర్యం చేయడానికి ఉపయోగించుకోవచ్చని ఎంపీలు భయపడ్డారు. అయితే.. కాంగ్రెస్ నుంచి ఇంత బలమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ, అప్పటి న్యాయ శాఖ అటార్నీ జనరల్ చార్లెస్ జె. బోనపార్టే వెనుకాడకుండా ఈ దర్యాప్తు సంస్థ ఏర్పాటుకు ముందడుగు వేశారు. 1908 జూలై 26న, కాంగ్రెస్ అధికారిక ఆమోదం కోసం చూడకుండా.. ఆయన న్యాయ శాఖలోనే 34 మంది ప్రత్యేక దర్యాప్తు అధికారులతో కూడిన ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఒక పరిపాలనా ఉత్తర్వును జారీ చేశారు.

అయితే.. ఈ చార్లెస్ జె. బోనపార్టే ఎవరంటే.. ప్రఖ్యాత ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే చిన్న సోదరుడైన జెరోమ్ బోనపార్టేకు మనవడు. ఆయన ఏర్పాటు చేసిన ఈ చిన్న టీం తదనంతరం FBIగా రూపాంతరం చెందింది. ప్రధానంగా భూ కుంభకోణాలు, బ్యాంకు మోసాలు, సమాఖ్య చట్టాల ఉల్లంఘనలను దర్యాప్తు చేయడం పైనే FBI తొలుత దృష్టి సారించేది. అయితే.. 1924లో జె. ఎడ్గర్ హూవర్ కేవలం 29 ఏళ్ల వయసులో FBI డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన డైరెక్టర్ అయిన తర్వాత FBI స్వరూపమే మారిపోయింది. FBI పనితీరులో హూవర్ అనేక విప్లవాత్మక మార్పులు చేశారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే 1935లో ఆ ఏజెన్సీ పేరు అధికారికంగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా (FBI) మారింది.

FBI అమెరికాలో నేరస్థులను పట్టుకోవడమే కాకుండా, నేరశాస్త్రం, పోలీసింగ్లో ఆధునిక పద్ధతులను ప్రపంచానికి పరిచయం చేసింది. నేటి ఆధునిక బయోమెట్రిక్ డేటాబేస్‌లకు 1924లోనే FBI పునాది వేసింది. 1932లో ఒక చిన్న గదిలో.. కేవలం ఒకే శాస్త్రవేత్తతో ప్రారంభమైన FBI ఫోరెన్సిక్ ల్యాబ్.. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్దదిగా మారడం విశేషం.