రుచికి చేదు అయినా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కాకర.వీటిల్లోని పీచు జీర్ణసంబంధిత సమస్యల్ని దరిచేరనివ్వదు. విటమిన్-ఎ, సి, పొటాషియం, జింక్, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి కాకరలో. వీటిని తరచూ తింటే రక్తహీనత నుంచి కూడా బయటపడొచ్చు. మరిన్ని లాభాలున్న కాకరని కాస్త వెరైటీగా వండుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పైగా వర్షాకాలంలో కమ్మని కాకరకాయ వంటల్ని ట్రై చేయండి..
కాకర పెరుగు పచ్చడి
కావాల్సినవి
- కాకరకాయ - ఒకటి
- చిక్కటి పెరుగు-- ఒక కప్పు
- పచ్చిమిర్చి- రెండు
- కొబ్బరి తురుము- అర కప్పు
- ఆవాలు--ఒక టీ స్పూన్
- ఎండుమిర్చి- ఒకటి
- నూనె-- వేగించడానికి సరిపడా
- ఉప్పు- తగినంత
- కరివేపాకు- రెండు రెబ్బలు
తయారీ
కాకరకాయను నాలుగు ముక్కల్లా చేసుకుని ఉప్పు నీళ్లలో వేయాలి.కాసేపయ్యాక నీరంతా గట్టిగా పిండేసి ముక్కల్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, సగం ఆవాల్ని వేసి మిక్సీ పట్టాలి. పెరుగులో ఈ మిశ్రమం, వేగించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేడిచేసి మిగిలిన ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు వేసి వేగించిన పెరుగుపై వేసి కలపాలి.
ALSO READ : ముసురు పట్టినప్పుడు అవీ, ఇవీ కాకుండా...
పకోడి
కావాల్సినవి
- కాకరకాయలు- పావు కేజీ
- బియ్యప్పిండి- ఆరు టేబుల్ స్పూన్లు
- ఉప్పు- రుచికి సరిపడా
- మిరియాల పొడి- పావు టీ స్పూన్
- కారం- ఒక టీ స్పూన్
- పసుపు-- పావు టీ స్పూన్
- ఇంగువ- చిటికెడు
- గరం మసాలా-- పావు టీ స్పూన్
- నూనె-- వేగించడానికి సరిపడా
తయారీ
కాకరకాయలను నిలువుగా కోసి గింజలు తీసి ముక్కలు చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఆ మిశ్రమంలో బియ్యప్పిండి, ఉప్పు, గరం మసాల, ఇంగువ, కారం కూడా కలపాలి. పది నిమిషాల తర్వాత కాగే నూనెలో పకోడీల్లా వేసి దోరగా వేగించాలి. అంతే టేస్టీ కాకరకాయ పకోడీ రెడీ.
