- మహారాష్ట్ర, పశ్చిమ కనుమల్లో వర్షపాతం 40 శాతం తక్కువ ఉంటుందన్న ఐఎండీ
- గతేడాదితో పోలిస్తే కృష్ణా, గోదావరి రిజర్వాయర్లలో అడుగంటిన జలాలు
- ఈసారి కృష్ణాకు సగం వరద కూడా డౌటే అంటున్న నిపుణులు
- కర్నాటకలో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు ఖాళీ
- ఆ ప్రాజెక్టులు నిండేందుకే ఆగస్టు వరకు పట్టొచ్చనే అంచనా
- అవి నిండితేనే శ్రీశైలం, సాగర్ దిక్కు వరద
- ఏపీ వాడకంపైనా టెన్షన్.. కంట్రోల్ చెయ్యకుంటే ఇక్కట్లేనన్న చర్చ
హైదరాబాద్, వెలుగు: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది మన సాగునీటి ప్రాజెక్టులకు గడ్డు కాలం తప్పకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. గతేడాదితో పోలిస్తే అన్ని ప్రాజెక్టులూ అడుగంటాయి. కృష్ణా, గోదావరి బేసిన్లకు అత్యంత కీలకమైన మహారాష్ట్ర, పశ్చిమ కనుమల్లో ఈ ఏడాది తీవ్రమైన వర్షాభావ పరిస్థితులుంటాయని ఐఎండీ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం కర్నాటకలో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎగువన వర్షాలు పడి.. కృష్ణా, గోదావరికి వరదలు వచ్చి మన ప్రాజెక్టులు నిండాలంటే ఆగస్టు దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ‘సగం’ వరద వచ్చేది కూడా అనుమానమే అంటున్నారు. ఇదే జరిగితే ఈ రెండు నదులపై ఉన్న కీలక ప్రాజెక్టులు నిండడం గగనమేనని, అందువల్ల కాలువ నీళ్లపై ఆధారపడి సాగుచేసే రైతులు జాగ్రత్తగా ఉండాలని, వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని ఎక్స్పర్ట్స్సూచిస్తున్నారు.
కర్నాటకలో ప్రాజెక్టులన్నీ ఖాళీ..
కృష్ణా, గోదావరి నదుల ప్రయాణం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లోనే మొదలవుతుంది. కానీ, ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్‌తో మహారాష్ట్ర, పశ్చిమ కనుమల్లో వర్షపాతం లోటు తీవ్రంగా ఉంటుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. అక్కడ పడాల్సిన వర్షం కన్నా 30 నుంచి 40 శాతం తక్కువగా ఉండవచ్చని అంచనా వేశారు. ఇదే జరిగితే.. ఆ రెండు పరివాహకాల్లో వరదలు తగ్గే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా మనకు కృష్ణాలో భారీ గండి పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. దానికి కారణం.. ఎగువన కర్నాటకే. మనకు ఎగువన ఆ రాష్ట్రంలో రెండు కీలకమైన ప్రాజెక్టులున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలున్నాయి. దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వరదలు రావాలంటే.. కర్నాటకలోని ఆ రెండు ప్రాజెక్టులు నిండాల్సిందే. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో వర్షాభావ పరిస్థితులతో ఆ ప్రాజెక్టులు నిండేందుకే ఆగస్ట్ వరకు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆల్మట్టిలో జలాలు దాదాపు అడుగంటిపోయాయి. ఆల్మట్టి పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం కేవలం 22.8 టీఎంసీల నిల్వ ఉన్నది. నిరుడు ఇదే టైమ్‌కు ఆ ప్రాజెక్టులో 65 టీఎంసీలు స్టోరేజీ ఉండగా.. ఇప్పుడు అత్యంత తక్కువగా ఉన్నది.
ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిండాలంటే 107 టీఎంసీల వరద రావాల్సి ఉంది. ఆ ప్రాజెక్టు నిండి.. నారాయణపూర్‌కు వదలాలి. ప్రస్తుతం నారాయణపూర్‌లో 37.64 టీఎంసీలకుగానూ 25 టీఎంసీల నిల్వ ఉన్నది. నిరుడు ఇదే టైంతో పోలిస్తే 8 టీఎంసీలు తక్కువగానే ఉంది. అంటే ఆ రెండు ప్రాజెక్టులు నిండి కిందికి వదిలితేగానీ.. మన ప్రాజెక్టులకు నీళ్లు రావు. ఇటు కృష్ణా పరివాహకంలో అత్యంత కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టులోనూ జలాలు అడుగంటాయి. 105.79 టీఎంసీలకుగాను కేవలం 10 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. శ్రీశైలానికి ఈ ప్రాజెక్టు కూడా కీలకంగా మారనుంది. కాబట్టి కర్నాటకలోని ప్రాజెక్టులు ఎంత త్వరగా నిండితే అంత త్వరగా మనకు నీళ్లొచ్చే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు. నిరుడు ఇదే టైంకు శ్రీశైలంలో 58 టీఎంసీల నీళ్లుండగా.. ఇప్పుడు కేవలం 40 టీఎంసీలే ఉన్నాయి. సాగర్‌లో మాత్రం నిరుడుతో పోలిస్తే కొంచెం మెరుగ్గా ఉంది. నిరుడు 136 టీఎంసీలుండగా.. ఇప్పుడు 144 టీఎంసీల నీళ్లున్నాయి. అవి కూడా డెడ్స్టోరేజ్కావడం గమనార్హం.
కృష్ణాపైనే ఆందోళన..
గోదావరి బేసిన్‌కు కూడా ఆలస్యంగానే వరదలు మొదలయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. నిరుడు కూడా కృష్ణాకు మొదలైన తర్వాతే.. గోదావరికి వరదలు మొదలయ్యాయి. కానీ గోదావరి బేసిన్‌కు వరద ఆలస్యమవుతుందని చెబుతున్నా.. ఆందోళనంతా కృష్ణా ప్రాజెక్టులపైనే ఉంది. మన రాష్ట్రానికి పైన గోదావరిపై పెద్ద ప్రాజెక్టులేవీ లేకపోవడంతో కొంచెం లేట్‌గానైనా మన ప్రాజెక్టులు నిండుతాయని చెబుతున్నారు. ఇటు ప్రాణహిత, స్థానిక వాగులతో గోదావరిలోకి వరద ప్రవాహాలు ఉంటాయని పేర్కొంటున్నారు. కానీ, కృష్ణాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. పైనుంచి వరదలు వస్తేనే మన ప్రాజెక్టులు నిండుతాయని అంటున్నారు. ఇటు ఏపీ వాడకం కూడా మనల్ని కలవరపెడుతున్నది. ఎదుటి వారి అవసరాలను పట్టించుకోకుండా ఎడాపెడా నీటిని తోడేసే అలవాటున్న పొరుగు రాష్ట్రం.. ఇప్పుడు మాత్రం వదులుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డెడ్‌స్టోరేజీ దిగువ నుంచి కూడా పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటిని తరలించుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వరదలు కొంచెం లేట్ అయినా.. ఏపీ నీటి వాడకంపై వేచి చూస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిరుడు అసలు వరదలు పూర్తి స్థాయిలో మొదలుకాకముందే.. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండకముందే నీటిని డైవర్ట్ చేయడం మొదలుపెట్టిన ఏపీ ఇప్పుడు ఆగుతుందా అనుమానమే. ఇప్పటినుంచే ప్రభుత్వం అలర్ట్‌గా ఉండి.. ఏపీని కంట్రోల్ చేయకపోతే అసలే కష్టకాలంలో మనకు మరింత సంక్షోభం తప్పదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఆగస్టు దాటితేనే మనకు వరదలు..
నిరుడు కాలం మంచిగవడంతో కృష్ణా ప్రాజెక్టులకు జూన్ చివరి వారం నుంచే వరదలు మొదలయ్యాయి. కర్ణాటకలోని ప్రాజెక్టులు వేగంగా నిండాయి. జులై తొలి వారం నుంచే మన ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరింది. తొలి రోజుల్లో దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల దాకా వరదలొచ్చాయి. కానీ, ఇప్పుడా పరిస్థితి ఉండదేమోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా బేసిన్‌కే వరదలు జులై రెండో వారంలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అదీ కూడా అత్తెసరు వర్షాలు పడితే.. కర్ణాటకలోని ప్రాజెక్టులు నిదానంగా నిండుతాయని, అదే జరిగితే మన ప్రాజెక్టులకు ఆగస్టు తర్వాతే వరదలు మొదలవుతాయని చెబుతున్నారు.
ప్రస్తుతం కృష్ణా బేసిన్‌కు కీలకమైన మహారాష్ట్రలో చెదురుమొదురు వర్షాలు తప్ప ఇంకా చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. ఆ రాష్ట్రంలోకి రుతుపవనాలు ఎంటరైనా వేగంగా విస్తరించడం లేదు. వారం రోజులుగా మహారాష్ట్రలో రుతుపవనాలు ఎక్కడున్నాయో.. అక్కడే స్తంభించిపోయాయి. దీంతో అక్కడ వర్షాలు ఊపందుకోవడానికి మరింత టైం పట్టేలా ఉందని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే వారం రోజులు కూడా విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్స్‌లో పేర్కొంది. దీనంతటికీ ఎల్నినో ప్రభావమే కారణమని చెబుతున్నది.
