ముంబై: యాత్రికులతో వెళ్తున్న పికప్ వ్యాన్ ప్రమాదవశాత్తూ బావిలో పడటంతో 8 మంది మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఆదివారం (జూన్ 14) సాయంత్రం చోటు చేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం.. రంజని గ్రామానికి చెందిన 15 మంది కలిసి ఓ మతపరమైన యాత్ర కోసం పికప్ వ్యాన్‌లో బయలుదేరారు.
ఈ క్రమంలో సోలాపూర్ జిల్లా మల్షిరాస్ తహసీల్‌లోని తండుల్వాడి గ్రామం సమీపంలో వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. ఈ ఈ ఘటనలో ఎనిమిది మంది యాత్రికులు మరణించగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని సోలాపూర్ ఎస్పీ అతుల్ కులకర్ణి తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు పిల్లల ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి.
►ALSO READ | పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. NCPలోకి 20మంది రెబెల్ TMC ఎంపీలు
బావిలో నుంచి వాహనాన్ని బయటకు వెలికితీసి.. గాయపడిన వారిని వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పికప్ వ్యాన్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒకేసారి 8 మంది మరణించడంతో రంజని గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
