రోజులు మారుతున్నయ్..మనుషులు కూడా అప్ డేట్ అవుతున్నారు. ఏం కావాలన్నా..అంతా ఆన్ లైన్ లో అన్న చందంగా తయారైంది సమాజం. అవును అమెరికాలో ఉన్న ఓ వ్యక్తి తన ఇంట్లో చేస్తున్న సత్యానారాయణ వ్రతాన్ని..కరీంనగర్ లో ఉన్న పంతులితో వీడియో కాల్ ద్వారా జరిపించారు. వీడియో కాల్ లో అర్చకుడు మంత్రాలు చదువుతుండగా..అమెరికాలో ఉన్న దంపతులు సత్యనారాయణ వ్రతాన్ని కంప్లీట్ చేశారు. ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.
అమెరికాలో నివసిస్తున్న వాల వినయ్ రావు దంపతులు కార్తిక మాసం సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అమెరికాలో అర్చకులు దొరకడం కష్టంగా ఉండటంతో ఆన్‌లైన్ వ్రతం నిర్వహించాలనుకున్నారు.
ఇందుకోసం కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడులోని శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అర్చకులైన, దేవరాజు ప్రశాంత్ శర్మని సంప్రదించారు ఎన్నారై దంపతులు.నవంబర్ 9న ఇవాళ ఆన్‌లైన్ ద్వారా వ్రతం వివరంగా చెప్పి, పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చకులు దేవరాజు ప్రశాంత్ శర్మ. ఆన్ లైన్ లోనే బ్రాహ్మణ ఆశీస్సులు తీసుకున్నారు దంపతులిద్దరు. ఈ వీడియో వైరల్ అవడంతో అయ్యగార్లు కూడా అప్ డేట్ అయ్యారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్
