పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్యాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎంతో ఖర్చు చేస్తున్నాయి. కానీ, చాలా సందర్భాలలో అవి అట్టడుగున ఉన్న అతి పేద కుటుంబాలకు అందకపోవడంతో స్వాతంత్ర్య భారతదేశంలో ఇంకా కడు పేదవారు మిగిలే ఉన్నారు. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 3% జనాభా అంటే సుమారు 12 లక్షల మంది ఇంకా కడు పేదరికంలో మగ్గుతున్నారు. ఇక ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 3 డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు అతి పేదరికంలో మగ్గుతున్నారని లెక్క. వీరికి సరియైన ఉపాధి, ఇతర సంక్షేమ పథకాలు అందక కడు పేదవారిగా జీవిస్తున్నారు.
గత 75 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలు ఏమైనట్లు? అవి కడు పేదల వరకు ఎందుకు చేరడం లేదు అని ఆలోచించినప్పుడు ఈ సంక్షేమ పథకాల అమలులో విపరీతమైన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, రాజకీయ నాయకుల అండదండలతో చాలామటుకు ఉన్నవారే ఒకటికి రెండుసార్లు లబ్ధి పొందిన సందర్భాలు చాలా ఉన్నాయి.
అనర్హులకు సంక్షేమ పథకాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఓట్లను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలు అమలుచేయడం జరుగుతోంది. ఆహార భద్రతకు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో రకరకాల అంచనాల ప్రకారం సుమారు 25% జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. అయితే, గుడ్డెద్దు చేనులో పడినట్లు రాష్ట్రంలోని 90% జనాభాకు ఉచితంగా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతోంది. ఇకపోతే రైతుబంధు (రైతు భరోసా) చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులకు ఇవ్వాలి. కానీ, పాసు పుస్తకం ఉన్న ప్రతి రైతు అంటే వందల ఎకరాలు ఉన్నవారికి కూడా రైతుబంధు ఇవ్వడం జరుగుతోంది. అలాగే, వ్యవసాయానికి ఉచిత కరెంటు ఒక రైతుకు రెండు మోటార్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చిన బాగుండేది.
అందుకు బదులు పది మోటార్లతో భూగర్భ జలాలను అధికంగా వాడుతున్న పెద్ద రైతులకు కూడా ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు వాడేవారికి ఉచిత కరెంటు. వీరి ఇంటిలో టి.వి, ఫ్రిజ్, ఇంటిముందు మోటార్ సైకిల్ ఉంటాయి. వీరిని పేదలు అనడానికి వీలు లేదు. అయినా ప్రభుత్వం ఓట్లను దృష్టిలో ఉంచుకొని ఉచిత కరెంటు ఇస్తున్నారు. ఇక రూ. 8 లక్షలతో డబుల్‌బెడ్ రూంల నిర్మాణం చేశారు. ఉద్దేశం చాలా బాగున్నా అమలు లోపంతో చాలామంది అనర్హులు దళారులకు ముడుపులు చెల్లించి ఇళ్లు పొందుతున్నారు. ఇల్లు లేని కడుపేదలకు సహాయం అందడం లేదు.
పేదలను ప్రభుత్వం ఆదుకోవాలి
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి కార్యక్రమాలు కడు పేదలకు అందకుండా పోతున్నాయి. గత ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ వృత్తిగా గొర్రెల పెంపకం కార్యక్రమం చేపట్టింది. భూమిలేని గొల్ల కురుమలకు ఇది ఎంతో లాభకరమైన కార్యక్రమం. అయితే అమలులో లోపం, అవినీతి వంటి వాటితో పేదలకు లాభం కలుగలేదు. ఇప్పటికీ రాష్ట్రంలో సంచార జాతుల వారు బిక్షాటన చేసి జీవించేవారు చాలామంది ఉన్నారు. అటువంటి కడు పేదలను ఆదుకొనే కార్యక్రమం కావాలి. కేరళ రాష్ట్రంలో కడుపేదలను గుర్తించి వారికి సహాయం చేయుటకు ఒక కార్యక్రమం 2021లో ఎక్స్‌ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రాజెక్టు చేపట్టారు.
ఇందులో ఒక పద్ధతి ప్రకారం కడుపేదలను గుర్తించే కార్యక్రమంలో గ్రామ సభల ద్వారా, గ్రామ పంచాయతీలు, ఆసరా కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో మొదట కడు పేద కుటుంబాలను గుర్తించి ప్రతి కుటుంబ అవసరాలపై ఒక ప్రత్యేక ప్రణాళిక తయారుచేసి సుమారు 64 వేల కుటుంబాలవారు కడు పేదతనం నుంచి బయట పడడానికి కార్యక్రమాలు చేపట్టారు. గత 4 సంవత్సరాల్లో కేరళ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేసింది.
ఇప్పుడు కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలో పేదలు ఎవరూ లేరని గొప్పగా చెపుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వం చేపట్టిన పద్ధతి అమలును పరిశీలించేందుకు సంబంధిత అధికారులను అక్కడకు పంపి తెలంగాణ రాష్ట్రంలో కూడ ఈ పథకాన్ని అమలుచేయాల్సిన అవసరం ఉంది. కడు పేదవారిని అదుకొనే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుతుంది.
- యం. పద్మనాభరెడ్డి,
అధ్యక్షుడు, ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్
