అవినీతి మత్తులో డ్రగ్ కంట్రోల్..ఆఫీసర్లపై డీజీకి కుప్పలు తెప్పలుగా కంప్లైంట్స్

అవినీతి మత్తులో డ్రగ్ కంట్రోల్..ఆఫీసర్లపై డీజీకి కుప్పలు తెప్పలుగా కంప్లైంట్స్
  • మందుల క్వాలిటీ చెకింగ్ బంద్.. మూమూళ్లపైనే ఫోకస్
  •  డ్యూటీని గాలికొదిలేసి.. దందా చేస్తున్నారని ఆరోపణలు
  • ఫిర్యాదులు వస్తున్నా... చర్యలు అంతంత మాత్రమే

హైదరాబాద్, వెలుగు: జనానికి రోగం నయం కావాలంటే మందులే దిక్కు. కానీ, ఆ మందుల నాణ్యతను చూడాల్సిన అధికారులే అవినీతి మత్తులో జోగుతున్నరు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన డ్రగ్  కంట్రోల్  అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) లోని కొందరు అధికారులు దారి తప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మందుల క్వాలిటీ చెకింగ్  పక్కనపెట్టిన ఆఫీసర్లు.. కరెన్సీ కౌంటింగ్‌‌ పైనే ఫోకస్  పెట్టారని ప్రజలు, సంస్థల నుంచి డీజీకి అనేక కంప్లైంట్స్  వస్తున్నాయి. డ్రగ్ ఇన్ స్పెక్టర్  మొదలు అసిస్టెంట్  డైరెక్టర్లు, లైసెన్సింగ్  ఆఫీసర్ల దాకా అంతా మామూళ్లమయమేనని ఆరోపణలు ఉన్నాయి. 

జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నా అధికారుల వేధింపులు తట్టుకోలేక మెడికల్  షాపుల ఓనర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నప్పటికీ... డిపార్ట్‌‌మెంట్  తీరు మారడం లేదు. నాణ్యతలేని మందులు, నకిలీ ఔషధాలను అరికట్టాల్సిన బాధ్యతను గాలికొదిలేసి.. తనిఖీల పేరుతో క్యాష్  చేసుకుంటున్నారని డీజీ ఆఫీసుకు కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

రేట్ కార్డులు పెట్టి మరీ వసూళ్లు

నిజానికి మార్కెట్ లో దొరుకుతున్న మందుల నాణ్యతను పరీక్షించడం, ఫార్మా కంపెనీలు రూల్స్  పాటిస్తున్నాయో లేదో చూడటమే అధికారుల అసలు పని. కానీ ఇప్పుడు ఆ పనులన్నీ పక్కకు పెట్టి తనిఖీల పేరుతో వెళ్లడం, చిన్నచిన్న లోపాలను కూడా భూతద్దంలో చూపి భయపెట్టడం, ఆపై బేరసారాలకు దిగడమే నిత్యకృత్యమైందని ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే ఒక్కో పనికి అనధికారికంగా రేట్ కార్డులు ఫిక్స్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. 

కిందిస్థాయి సిబ్బంది తప్పులను సరిదిద్దాల్సిన ఓ లైసెన్సింగ్  అధికారిపైనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఓ జిల్లా అధికారి వేధింపులు తాళలేక ఓ ఫార్మా యజమాని ఆత్మహత్యాయత్నం చేసినా.. సదరు ఆఫీసర్ పై చర్యలు తీసుకోకపోగా, తిరిగి కాసులు కురిపించే ప్రాంతంలోనే పోస్టింగ్  ఇచ్చారని అధికారులే గుసగుసలాడుకుంటున్నారు. 

మరోవైపు.. పుదుచ్చేరి నుంచి వచ్చిన నకిలీ మందులు హైదరాబాద్‌‌ లో దొరికినా.. ఏమీ దొరకలేదని సిటీలో మెడికల్  షాపులు అధికంగా ఉండే ప్రాంతానికి చెందిన ఓ డ్రగ్ ఇన్‌‌ స్పెక్టర్  తప్పుడు రిపోర్టు ఇచ్చి లబ్ధి పొందినట్లు సమాచారం. ఇప్పటికైనా డీసీఏ ఉన్నతాధికారులు మేల్కొని.. ప్రధాన కార్యాలయం నుంచి జిల్లాల వరకు స్పెషల్  ఫోకస్  పెట్టాలని, పెండింగ్‌‌లో ఉన్న ఫిర్యాదులపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజారోగ్యానికి రక్షణ ఉంటుందని జనం కోరుతున్నారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి

డ్రగ్  కంట్రోల్  అధికారుల వసూళ్ల దందాకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇటీవలే కరీంనగర్ లో ఓ మెడికల్ షాపులో తనిఖీల పేరుతో వెళ్లిన అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్ ఇన్‌‌స్పెక్టర్.. ఓ ప్రైవేటు వ్యక్తితో కలిసి షాపు యజమానిని భయభ్రాంతులకు గురిచేశారు. రూ.20 వేలు లంచం డిమాండ్  చేశారు. ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆ ఇద్దరు ప్రభుత్వ అధికారులను రెడ్ హ్యాండెడ్‌‌ గా పట్టుకున్నారు. 

లేని అడ్రస్ కు లైసెన్స్  ఇచ్చారని  

క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే, అసలు ఉనికిలోనే లేని ఓ చిరునామాపై ఫార్మా సప్లై కంపెనీకి అధికారులు లైసెన్స్  మంజూరు చేశారని ఓ వ్యక్తి డీజీకి కంప్లైంట్ చేశారు. సదరు వ్యక్తి ప్రమాదకర మందులు అమ్ముతున్నా, అధికారులను తానే మేనేజ్  చేస్తానని బహిరంగంగా చెబుతున్నాడని కంప్లైంట్ లో పేర్కొన్నారు. 

 ఓ అధికారి ఆస్తులపై 

సిద్దిపేటలో పనిచేస్తున్న ఓ అధికారి నిబంధనలకు విరుద్ధంగా నడిచే బోగస్  ఏజెన్సీలకు సహకరిస్తున్నారని, లైసెన్సుల జారీని వ్యాపారంగా మార్చుకున్నారని ఓ న్యాయవాది డీజీకి ఫిర్యాదు చేశారు. విధులను గాలికొదిలేసి అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ అధికారి ఆస్తులపై విచారణ జరిపించాలని కోరారు.