- లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
- కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు
శ్రీశైలం, వెలుగు: మహా శివరాత్రికి ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైలం ముస్తాబవుతోంది. ఆదివారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా.. ఈ నెల 18 వరకు కొనసాగనున్నాయి.
బ్రహ్మోత్సవాల వివరాలు..
8న ధ్వజారోహణం, శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి స్వామి అమ్మవార్లకు పట్టువస్ర్తాల సమర్పణ, 9న భృంగి వాహన సేవ, ద్వారక తిరుమల దేవస్థానం వారి పట్టు వస్ర్తాల సమర్పణ, 10న హంస వాహన సేవ. విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం నుంచి పట్టు వస్ర్తాల సమర్పణ, 11న మయూర వాహన సేవ, ఉదయం కాణిపాకంలోని వర సిద్ధి వినాయక దేవస్థానం నుంచి పట్టు వస్ర్తాల సమర్పణ, సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్ర్తాల సమర్పణ, 12న రావణ వాహన సేవ, అదే రోజు ఏపీప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాల సమర్పణ, 13న పుష్క పల్లకీ సేవ, 14న గజ వాహన సేవ, 15న మహా శివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం, నంది వాహన సేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, మల్లికార్జున భ్రమరాంబిక దేవి కల్యాణం, 16న రథోత్సవం, తెప్పోత్సవం, 17న యాగ పూర్ణాహుతి, ధ్వజారోహణ, 18న అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
కాగా.. శివ మండల దీక్ష, అర్ధ మండల శివదీక్షను స్వీకరించిన భక్తులు మల్లికార్జున స్వామి జ్యోతిర్ముడి(ఇరుముడి) సమర్పించడం సంప్రదాయం. పాతాళగంగ రోడ్డు మార్గంలోని శివదీక్షా శిబిరాల వద్ద ఆదివారం నుంచి ఈ నెల 22 వరకు ఇరుముడి సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
35 లక్షల లడ్డూల తయారీ..
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి సాధారణ భక్తులతో పాటు శివ దీక్ష స్వాములు, పాదయాత్రగా వచ్చే భక్తులు రోజూ లక్షల్లో తరలి రానున్నారు. ఈ క్రమంలో ఆఫీసర్లు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లడ్డూలను అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ముందస్తుగా 35 లక్షల లడ్డూలను తయారు చేయించారు. 15 శాశ్వత లడ్డూ కౌంటర్లతో పాటు అదనంగా దేవస్థాన అన్న ప్రసాద వితరణ భవనం వద్ద 9 తాత్కాలిక కౌంటర్లను, గణేశ సదనం ఎదురుగా రెండు తాత్కాలిక కౌంటర్లు, సీఆర్వో కార్యాలయం వద్ద నాలుగు తాత్కాలిక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగు రోజుల పాటు ఒక్కో భక్తుడికి ఫ్రీగా లడ్డూలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
భక్తుల కోసం చలువ పందిళ్లు..
శివ దీక్షా శిబిరాలు, టోల్‌గేట్ సమీపంలోని బసవవనం, సిబ్బంది వసతి గృహాల వద్ద ఉన్న బాల గణేశ వనం, ఆలయ దక్షిణ భాగంలోని రుద్రాక్ష వనం, శివాజీ గోపురం ఎదురుగా ఉన్న శివాజీ పార్కు, తెలుగు విశ్వవిద్యాలయం సమీపంలోని రుద్రా పార్కు, మల్లమ్మ కన్నీరు తదితర ప్రాంతాల్లో భక్తులు సేద తీరేందుకు చలువు పందిళ్లను ఏర్పాటు చేశారు.
సాక్షి గణపతి, పార్కింగ్ ప్రదేశాలు, అన్నదాన భవనం, కల్యాణకట్ట, చండీశ్వరసదనం ఆరుబయలు ప్రదేశాలలో కూడా చలువ పందిళ్లు అందుబాటులో ఉన్నాయి. క్షేత్రంలో 13 ఎకరాల విస్తీర్ణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు. .
ఆర్జిత సేవలు నిలిపివేత..
శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నుంచి ఈ నెల 18 వరకు అన్ని ఆర్జిత సేవలను నిలిపివేశారు. భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు. అయితే ఇరుముడి కలిగిన శివ దీక్షా భక్తులకు మాత్రం ఆదివారం నుంచి ఈ నెల 12 వరకు నిర్ణీత సమయాల్లో స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. 13 నుంచి 18 వరకు స్పర్శ దర్శనాలను పూర్తిగా నిలిపి వేయనున్నారు.
