అభివృద్ధి పేరుతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వేల కోట్లు స్వాహా: మంత్రి వివేక్ వెంకటస్వామి

అభివృద్ధి పేరుతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వేల కోట్లు స్వాహా: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ప్రాజెక్టుల్లో కమీషన్లు దండుకుని, కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది: మంత్రి వివేక్ వెంకటస్వామి 
  • దోచుకున్న సొమ్ములో వాటాల కోసమే కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు
  • కాంగ్రెస్‌‌‌‌ ప్రజాపాలనలో జోడెద్దుల్లా పరుగులు పెడుతున్న సంక్షేమం, అభివృద్ధి 
  • గజ్వేల్, దుబ్బాకలో మున్సిపల్‌‌‌‌ ఎన్నికల ప్రచారం

గజ్వేల్/ సిద్దిపేట(దుబ్బాక) వెలుగు: అభివృద్ధి పేరిట గత బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వం రూ.వేల కోట్లు స్వాహా చేసిందని సిద్దిపేట జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రాజెక్టుల్లో కమీషన్లు దండుకుని.. కాంట్రాక్టర్లకు దోచిపెట్టారన్నారు. ఈ దోచుకున్న సొమ్ములో వాటాల కోసమే కల్వకుంట్ల కుటుంబంలో గోడవలు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గజ్వేల్, దుబ్బాకలో మంత్రి పర్యటించి, మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు పెడుతున్నాయని, ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు రూ.21 వేల కోట్లు ఇచ్చామని, ఉచిత బస్సు స్కీమ్​కు రూ.9 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అందినకాడికి దోచుకున్న కేసీఆర్‌‌‌‌కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, హరీశ్ రావు తప్పుడు నిర్ణయాలతో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో సర్వం కోల్పోయిన ముంపు బాధితులను ఆదుకుంటామని, ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉందని, తాను కూడా సీఎంతో మాట్లాడి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. మరోవైపు, గజ్వేల్‌‌లో యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు రూ.50 కోట్లతో అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గజ్వేల్ అభివృద్ధికి అడిగిన అన్ని నిధులిస్తుండగా, ఇటీవల రూ.18 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గజ్వేల్ ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావును ప్రజలు అడ్డుకోవడమే వారి పాలనకు నిదర్శనమన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో దుబ్బాక, చెన్నూరుకు రావాల్సిన నిధులను సిద్దిపేట, గజ్వేల్‌‌కు తరలించారని ఆరోపించారు. రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని, వాళ్లు మాత్రం రూ.వెయ్యి కోట్లు పార్టీ ఫండ్ కింద దాచారని అన్నారు. 

దుబ్బాక రెవెన్యూ డివిజన్ కోసం కృషి చేస్తా.. 

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. దుబ్బాకలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే డబుల్ బెడ్రూమ్‌‌ ఇండ్ల సమస్య తీర్చడం లేదని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. వంద రోజుల్లో డబుల్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేయడంతో పాటు కరెంట్, డ్రైనేజీ, వాటర్ సమస్యలను తీరుస్తామన్నారు. అమృత్ స్కీం కింద ఆరు నెలల్లో ఇంటింటికి తాగు నీళ్లు ఇస్తామని తెలిపారు. దుబ్బాక అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.15 కోట్లు మంజూరు చేశామని, మరో రూ.15 కోట్లు మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని తెలిపారు. దుబ్బాకకు మరో 350 ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎన్నికల ఇన్‌‌చార్జి కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంక్షా రెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్‌‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.