- పెబ్బేరులో కాస్ట్లీగా మారిన ఎన్నికలు
- ఓటుకు రూ.5వేల నుంచి రూ.10 వేలతో ఎర!
- కొన్నిచోట్ల ఒట్టేయించుకొని డబ్బులిస్తున్న అభ్యర్థులు
- ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ ఖర్చు
- మద్యం, నగదు పంపిణీతో వేడెక్కిన రాజకీయం
వనపర్తి, వెలుగు : జిల్లాలోని మున్సిపల్ ఎన్నికలు మునుపెన్నడూ లేనంతగా ఖరీదైనవిగా మారుతున్నాయి. ముఖ్యంగా మున్సిపల్చైర్ పర్సన్ స్థానాలను జనరల్, జనరల్ మహిళలకు కేటాయించడంతో, ఆయా పదవులను ఎలాగైనా చేజిక్కించుకోవాలని అభ్యర్థులు లక్షలు కుమ్మరిస్తున్నారు. శనివారం నుంచి క్షేత్రస్థాయిలో ఓటుకు రేటు కడుతూ నగదు పంపిణీకి తెరలేపారు. ప్రచారానికి వచ్చే వారికి నిత్యం భోజనాలు, రూ. 300 నుంచి రూ. 500 నగదుతో పాటు పురుషులకు అదనంగా మద్యం కూడా ఎరగా వేస్తున్నారు.
పెబ్బేరులోనే ఎక్కువ మొత్తంలో..
పెబ్బేరు మున్సిపాలిటీలో ఎన్నికలు కాస్ట్లీగా మారాయి. ఇక్కడ చైర్ పర్సన్ పీఠంపై కన్నేసిన అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు చేస్తున్నారు. ఒక అభ్యర్థి ఓటుకు రూ. 5 వేలతో పాటు ఖరీదైన మద్యం సీసా ఇస్తుంటే, మరో ప్రత్యర్థి అభ్యర్థి ఏకంగా రూ. 10 వేలు ఇస్తానని ప్రకటించారని తెలుస్తోంది. గత నాలుగు దశాబ్దాల ఎన్నికల చరిత్రలో ఒక ఓటుకు ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి అని సీనియర్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెబ్బేరు రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఒట్టేయించుకొని డబ్బులిస్తున్రు..
వనపర్తి మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చైర్ పర్సన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో, నేతలు తమ సతీమణులను బరిలోకి దింపి ధనబలాన్ని ప్రయోగిస్తున్నారు. ఇక్కడ ఓటుకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు పంపిణీ చేస్తూ మద్యం బాటిళ్లను పంచుతున్నారు. ఒక వార్డులో మహిళా ఓటర్లతో ఓట్లు వేయించుకుంటున్నారు. ఇక్కడ ఓటుకు రూ.వేలు చొప్పున పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అప్పులు చేసైనా సరే..
కొత్తకోట, అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీల్లోనూ నగదు పంపిణీ జోరుగా సాగుతోంది. కొత్తకోటలో ఓటుకు వెయ్యి రూపాయల నుంచి రూ. 3వేల వరకు ఇస్తుండగా, నారాయణపేట జిల్లా పరిధిలోకి వచ్చే అమరచింత, ఆత్మకూరుల్లోనూ భారీగానే పంపకాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా, వారి కంటే ఎక్కువే పంచాలనే తాపత్రయంతో అభ్యర్థులు అప్పులు చేసైనా సరే ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచార సమయం ముగియవస్తుండటంతో ఈ పంపిణీ పర్వం మరింత వేగం పుంజుకుంది.
