చేర్యాల, వెలుగు: కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ కె.రమేశ్ ను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్.రష్మీ పెరుమాళ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రమేశ్‌ను హెడ్‌క్వార్టర్స్‌లో డ్యూటీకి హాజరుకావాలని ఆదేశించినప్పటికీ, అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు విచారణలో తేలిందన్నారు.
విధులకు గైర్హాజరైన సమయంలో రమేశ్ చేర్యాలలో ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు. చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో 2వ వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న తన భార్యకు మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు ఉండడంతో రమేశ్‌ను సస్పెన్షన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే కానిస్టేబుల్ భార్య చేర్యాల అంబేద్కర్ సెంటర్లో ఆందోళన చేపట్టింది. తన భర్తను సస్పెండ్ చేయడం సరైంది కాదని వాపోయింది.
